బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన రెండో దశ పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. అయితే, ఇవాళ సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించాయి. ఇటిక్యాల మండలం వేములలో బండి సంజయ్ పాదయాత్రకు నిరసన వ్యక్తం చేశారు. ఇక, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజుల ప్రశాంతంగా కొనసాగిన యాత్రలో ఐదో రోజు ఉద్రిక్తత నెలకొంది.
Read Also: Vidadala Rajini: ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ..
ఈ ఘటనలో టీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన ఓ కారును ధ్వంసం చేశారు బీజేపీ శ్రేణులు.. ఇక, ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన బండి సంజయ్.. టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నా స్వాగతిస్తాం అన్నారు.. వారు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. పాలమూరు ప్రజల సమస్యలను వెలికితీస్తున్నాం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికీ పాదయాత్రలు చేసే హక్కు ఉంది.. ప్రశ్నించే హక్కు కూడా ఉంది.. తాము ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం వల్లే తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ కూడా పాదయాత్ర చేయొచ్చు అని సూచించారు బండి సంజయ్.