కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదు..? కవిత సమాధానం ఇదే..
కేటీఆర్‌తో గ్యాప్‌పై మాట్లాడటానికి కవిత ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పైనే ఫోకస్ ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతారన్నారు. బండి సంజయ్ కు ఈటల వార్నింగ్ ఇచ్చినా.. చర్చ లేదన్నారు. బీఆర్ఎస్ గురించే ఎందుకు చర్చ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అనంతరం సింగరేణిపై మాట్లాడుతూ.. ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం సింగరేణి.. సింగరేణిని తెలంగాణ రాష్ట్రంలో కాపాడాలని కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. సింగరేణి లో ఎంతో బొగ్గు తవ్వాల్సి ఉంది.. మొత్తం 185 మైన్స్ చేయొచ్చు.. సంవత్సరానికి 5 మైన్స్ ఓపెన్ చేయాలన్నారు. సింగరేణి కార్మికుల మీద వేసిన టాక్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి లో ఉన్న HMS సంఘం తో కలిసి తెలంగాణ జాగృతి పనిచేస్తుంది
పులివెందులలో 550 మందిపై బైండోవర్ కేసులు.. భారీగా పోలీసుల బందోబస్తు..
కడప జిల్లాలోని పులవెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. దీంతో పులివెందులలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే.. అలాగే, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పులివెందులలో 550 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా.. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక కోసం 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పులివెందులలో 550 మంది పైన బైండోవర్ కేసులు నమోదు అయ్యాయి.
రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ నరకయాతన.. మర్గమధ్యలోనే ప్రసవం..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగిసింది. అయినా కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం మన నాయకులు చెత్త పాలనకు అద్దంపడుతోంది. గిరిజన గ్రామాల్లో సైతం రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం మున్యా నాయక్ తండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండాలోకి వెళ్లేందుకు అంబులెన్స్ కి రోడ్డు మార్గం లేక గర్భిణీ కష్టాలు పడింది.. ఆశా కార్యకర్తల సహాయంతో 2 కిలోమీటర్ల వరకు గర్భిణీని కుటుంబ సభ్యులు వీపుపై మోసుకెళ్లారు. ఆమె సుమారు గంట పాటు నరకయాతన అనుభవించింది. మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ లో నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తండాకు రోడ్డు వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన ప్రాంతాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు..
గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మార్చే కీలక ప్రాజెక్టు అడవి తల్లి బాట.. ఈ ప్రాజెక్టు కింద కొత్త రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తవ్వాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 625 గిరిజన ఆవాసాలను రహదారి సౌకర్యంతో అనుసంధానించేందుకు రూ.1005 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలవుతోందన్నారు. పీఎం జన్ మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, అలాగే ఉప ప్రణాళిక నిధులను వినియోగించి ఈ పనులు చేపడుతున్నారని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులు పనుల పురోగతిని పవన్ కి వివరించారు. కొండ ప్రాంతాలు, నిటారుగా ఉన్న మార్గాలు, వర్షాల దెబ్బ… ఇవన్నీ పనుల వేగాన్ని తగ్గిస్తున్నాయన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 128 రహదారులలో 98కి ఇప్పటికే అటవీ అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 186 పనులు ప్రారంభమయ్యాయి, మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి రహదారి సౌకర్యం అందుకోబోతున్న గిరిజన ఆవాసాలు ఉన్నాయన్నారు. స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలియజేయడం, వారి సహకారం పొందడం అత్యవసరమని సూచించారు. నిరంతర పర్యవేక్షణతో పనులు వేగవంతం చేసి డోలీరహిత గిరిజన ఆవాసాలు లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు.
హలో! నేను విరాట్ కోహ్లీ.. యువకుడికి స్టార్ క్రికెటర్ల నుంచి కాల్స్..
క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియాల్లో వాలిపోతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. తమ ఫేవరెట్ క్రికెటర్స్ ను ఎంకరేజ్ చేస్తూ సందడి చేస్తుంటారు. తమకు ఇష్టమైన క్రికెటర్ తో సెల్ఫీ దిగాలని ట్రై చేస్తుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఏ ప్రయత్రం చేయకుండానే స్టార్ క్రికెటర్ల నుంచి కాల్స్ పొందాడు. అందులోను రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న ఒక యువకుడి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి ప్రముఖ క్రికెటర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మొదట, ఆ యువకుడు కూడా ఈ కాల్స్ నకిలీవని అనుకున్నాడు, కానీ దర్యాప్తులో ఈ కాల్స్ పూర్తిగా నిజమైనవని తేలింది. ఈ విషయం తెలిశాక ఆశ్చర్యపోయారు.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.. ఫెడరేషన్ వార్నింగ్..
సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 8వ రోజు అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి తమ గళం వినిపించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కొందరికి పెంచి మిగతా వారికి పెంచకపోవడం అన్యాయం అన్నారు. అన్ని యూనియన్ల వారికి పెంచాల్సిందే అని డిమాండ్ చేశారు. మొదటి ఏడాది 20 శాతం పెంచి రెండో ఏడాది 10 శాతం పెంచాలని కోరుతున్నట్టు తెలిపారు. దానికి ఛాంబర్ ఒప్పుకోవట్లేదని.. వాళ్ల కండీషన్లకు తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. నిర్మాత విశ్వ ప్రసాద్ మాకు లీగల్ నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావట్లేదు. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే ఛాంబర్ తో మాట్లాడుకోవాలి. పీపుల్స్ మీడియా మాకు రూ.90లక్షల బాకీ ఉంది. ఆయన మాకు క్షమాపణ చెప్పాలి. మేం ఎవరికీ తలొగ్గేది లేదు. మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించొద్దు. బయటి వారిని తెచ్చుకుంటామని నిర్మాతలు చెబుతున్నారు. మేం బయటి వారిని రానివ్వం. అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అంటూ తేల్చిచెప్పారు ఫెడరేషన్ సభ్యులు. సోమవారం మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. అందులో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
దాడులతో దద్దరిల్లిపోయిన పులివెందుల.. కాసేపట్లో మైకులు బంద్..!
మరి కాసేపట్లో ఉప ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం కాకరేపింది. గత వారం రోజులుగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. దాడులతో పులివెందుల దద్దరిల్లిపోయింది. అయినా వైసీపీ వెనకడుగు వేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు మారు మోగాయి. టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ ఎన్నికల ప్రచారం జరిగింది.. టీడీపీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. పులివెందులలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత మఖాం వేశారు.. ఒంటిమిట్టలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తిష్ట వేశారు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ముమ్మర ప్రచారం నిర్వహించారు… కాగా.. మరి కాసేపట్లో మైకులు బంద్ కానున్నాయి.
హైదరాబాద్‌లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా ముంపు ప్రాంతాలను పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్, అమీర్‌పేట్ ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బల్కంపేట్‌లోని ముంపు ప్రభావిత కాలనీల్లో ప్రజల పరిస్థితి, నష్టాలను పరిశీలించారు. ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో సీఎం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ మరియు సంబంధిత అధికారులను వెంటబెట్టుకొని పర్యటించిన సీఎం, వరదనీటి ప్రవాహం, డ్రైనేజీ వ్యవస్థ, సహాయక చర్యలపై వివరాలు కోరారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని మోహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి మునిగిన రహదారులు, ఇళ్లలోకి ప్రవేశించిన వరదనీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనంగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.
పోలీసుల వినూత్న ప్రయత్నం.. ఇది పేద ప్రజలకు ఓ వరం..!
వివిధ అవసరాలతో ఇబ్బంది పడే పేద ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏలూరు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇళ్లలో వాడకుండా ఉండే పాత బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలను ఇతరులు ఉపయోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు.. కైండ్ నెస్ వాల్ పేరుతో ఏర్పాటు చేసిన వినూత్న ప్రయోగానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఏలూరు జిల్లా పోలీసులు ఆశిస్తున్నారు.. ప్రతి ఇంట్లోనూ ఉపయోగించకుండా పక్కన పెట్టేసిన వస్తువులు అంటే పాత బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలు తదితర సామాగ్రి సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది.. అలా వాడకుండా పక్కన పెట్టేసిన వస్తువులను వాటి అవసరమున్న వారికి అందించేందుకు ఏలూరు పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏలూరు పోలీస్ స్కూల్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఆవరణలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో కైండ్నెస్ వాల్ పేరుతో ఒక ప్రత్యేక అల్మరాను ఏర్పాటు చేశారు. ఈ అల్మారా ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఇంట్లో ఉపయోగం లేని వినియోగంలో లేని.. వస్తువులు బట్టలు గాని బొమ్మలు గాని ఎలక్ట్రానిక్ వస్తువులు గాని ఇతర ఏ వస్తువులు అయినా ఈ అల్మారా లో పెట్టవచ్చు అయితే అప్పటికే ఈ అల్మారా లో ఏవైనా వస్తువులు పెట్టి ఉంటే అవి మీకు అవసరమైతే వాటిని ఉచితంగా తీసుకుని వెళ్లి మీరు వినియోగించుకోవచ్చు. ఇది ఈ కైండ్ నెస్ వాల్ ప్రత్యేకత. ఇప్పటివరకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డిలు సంయుక్తంగా టేక్ ఏ బుక్ గివ్ ఏ బుక్ పేరుతో పుస్తకాల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ కు ప్రజల వద్ద నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు బాల ఈ అల్మారాలో ఉన్న బట్టలను ఉచితంగా తీసుకు వెళ్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. అన్ని శాఖలకు హై అలర్ట్ ఆదేశాలు
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. అమీర్‌పేట్, మైత్రివనం వద్ద వాటర్ లాగింగ్ పాయింట్లను హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షించాలంటూ ప్రభుత్వం అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.