దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారం ముగిసింది. సిర్పూర్‌కర్ హైపవర్ కమిషన్ నివేదికపై తాజాగా సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కూడా హాజరయ్యారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ ఎన్‌కౌంటర్ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని కోర్టు తేల్చిన సుప్రీం.. ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది.
చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీం కోర్టు వెల్లడించింది. కమిషన్ రిపోర్టు తమకు అందిందని, నివేదికను బహిర్గతం చేస్తామని తెలిపి సుప్రీం కోర్టు.. దోషులు ఎవరన్నది కమిషన్ గుర్తించిందని, సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఎన్‌కౌంటర్ ఘటన నివేదిక ద్వారా దోషులెవరో తేలిపోవడం, సుప్రీం కోర్టు ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయడంతో ఘటనలో పాల్గొన్న పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో పాటు సుప్రీం కోర్టు సైతం ఆసక్తికర ఆదేశాలు జారీ చేయడంతో హైకోర్టులో ఏం జరగనుందో అని ఉత్కంఠ నెలకొంది.