ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు రంగారెడ్డి జిల్లాలోని కందకూరు మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి భారీ ఎత్తున టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు హజరై ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర హాస్యాస్పదంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. బండి సంజయ్ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియది ఆమె సెటైర్లు వేశారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని ఆమె సూచించారు. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు టీఆర్‌ఎస్ జెండాలు ఆవిష్కరించాలన్నారు.