Revanth Reddy Says He Will Go Jail For Congress Party: కేసీఆర్‌పై మాట్లాడినందుకే తనని జైల్లో పెట్టారని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు, సోనియా గాంధీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు తాను వందసార్లైనా జైలుకు వెళ్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సైతం జైల్లో పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సొంతూరు చుట్టు కూడా రోడ్లు లేవని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను కేసీఆర్ తన పార్టీలో కలుపుకున్నాడన్నారు. కమ్యూనిస్టు నేతలు ఎటు వెళ్లినా.. కార్యకర్తలు మాత్రం ఆత్మసాక్షిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఇతర నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెంచేసి.. పేద, మధ్యతరగతి కుటుంబాలను బీజేపీ రోడ్డున పడేసిందన్నారు.
అసలు ఏం చేసిందని బీజేపీకి ఓటు వేయాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో తాను వంద కారణాలు చెప్తానని.. కానీ బిజెపి, టీఆర్ఎస్‌లకు ఎందుకు ఓటేయాలో నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో ఏ విధంగా గెలిచామో.. అదేవిధంగా మునుగోడులో కూడా గెలుస్తామని అధికార పార్టీ భావిస్తోందని అభిప్రాయపడ్డారు. మునుగోడు ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకముందని.. కచ్ఛితంగా మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని పిలుపునిచ్చిన ఆయన.. దేశం మునుగోడు వైపు చూస్తోందన్నారు. మీ అందరిని చూశాక నాకు ధైర్యం వచ్చిందని, మునుగోడులో కాంగ్రెస్ విజయం తథ్యమని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా..? అనే అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని.. ఒకప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్ మనిషేనని అన్నారు. మునుగోడులో ఆడబిడ్డకు టికెట్ ఇచ్చామని, మునుగోడు ఆడబిడ్డలంతా ఒకవైపు నిలబడి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.