Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ, ప్రధాని నరేంద్రమోడీకి స్నేహితుడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ జీవితంలో రెండు ప్రేమలు ఉన్నాయని, ఒకటి ఇటలీ అయితే మరొకరు ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
రెండు ప్రేమల్లో ఇటలీ ఉంది, ఎందుకంటే అతని తల్లి అక్కడి నుంచి వచ్చారు, రెండోది ప్రధాని మోడీ అని, ఆయన రాహుల్ గాంధీకి అధికారం ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని, అతనికి ఇంట్లో ఎవరూ స్నేహితులు లేకపోవడంతోనే బయట తన స్నేహితుల గురించి ఆలోచిస్తారని అన్నారు. 50 ఏళ్లు నిండినందున ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటే అతనికి ప్రయోజనంగా ఉంటుందని ఓవైసీ సెటైర్లు వేశారు.
Read Also: Digvijay Singh: కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు..
రాహుల్ గాంధీ శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. పీఎం మోడీకి ఇద్దరు స్నేహితులు ఉన్నారని, ఒకరు ఓవైసీ అయితే, రెండో వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ ఆరోపణలు చేశారు. మోడీ ప్రధాని కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్‌లోని కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతిపరులని, డబ్బు సంపాదించే మంత్రిత్వ శాఖల్ని తన కుటుంబం వద్దే కేసీఆర్ ఉంచుకున్నారంటూ విమర్శించారు. భూములు, ఇసుక, మద్యంతో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు డబ్బులు సంపాదించుకుంటున్నారంటూ ఆరోపించారు.