National Students Union Of India (NSUI) Protest at Front on TSPSC Office.
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ‘ఛలో టీఎస్పీఎస్సీ’కి పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్‌ఎస్‌యూఐ పిలుపు మేరకు విద్యార్థులు టీఎస్పీఎస్సీ భవనం సమీపంలోని గాంధీ భవన్‌లో గుమిగూడారు. అక్కడ అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అయితే, విద్యార్థులు గాంధీభవన్ గేట్లను ఎక్కి.. టీఎస్పీఎస్సీ భవనం వైపు పరుగులు తీశారు.
టీఎస్పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పలువురు కార్యకర్తలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.