తెలంగాణలో ఇప్పుడు భాగ్యలక్ష్మీ ఆలయం, చార్మినార్ వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేయడానికి సంతకాల సేకరణ ప్రారంభించడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామచంద్రరావు ఫైర్ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు రామచంద్ర రావు. కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. భాగ్యలక్ష్మీ ఆలయంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామానే ఇందుకు నిదర్శనం అని ఆరోపించారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని.. ఒకవైపు భాగ్యలక్ష్మీ ఆలయం అక్రమ కట్టడం అని పేర్కొంటూ మైనారిటీ మోర్చా నాయకులు అక్కడే నమాజ్ చేస్తామంటూ సంతకాలు సేకరణ చేపడుతున్నారని.. ఇంకో వైపు కాంగ్రెస్ నేతలు అమ్మవారి ఆలయంలో పూజుల నిర్వహిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు నాల్కల ధోరణికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రామచంద్రారావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. ఆ పార్టీ హైదరాబాద్ లో పూర్తిగా పట్టుకోల్పోయిందని అన్నారు. మైనారిటీల ఓటు బ్యాంకు కోసం సంతకాల సేకరణ పేరుతో ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇంకో వైపు భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద పూజల పేరిట హిందువులను రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా ఇదంతా గమనిస్తున్నారని.. కాంగ్రెస్ నేతలు ఇకనైనా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడుపుకునే పనులు మానుకోవాలని హితవు పలికారు.