బీజేపీలో చేరిన ఈటలపై మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల అవినీతి నాయకుడని, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని అలాంటి అవినీతి నాయకుడిని బీజేపీలో చేర్చుకుంటారని మోత్కుపల్లి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన దళితబంధు కార్యక్రమానికి మోత్కుపల్లి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తరువాత ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. అంతేకాదు, మోత్కుపల్లి బీజేపీకి కూడా రాజీనామా చేశారు. తనలాంటి వారు బీజేపీలో ఇమడలేరని, ఎమ్మెల్యేగా 30 ఏళ్ల అనుభవం ఉన్న తనను ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పక్కన పెడుతున్నారని అన్నారు.
Read: స్టార్స్ గెటప్ లో నిహారిక గ్యాంగ్ సందడి!
ఈటలను పార్టీలో చేర్చుకుంటున్నట్టు తనకు ఒక్కమాట కూడా చెప్పలేదని, భూకబ్జాలు చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని మోత్కుపల్లి ప్రశ్నించారు. దళితబంధు వంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా బీజేపి తప్పు చేసిందని అన్నారు. కేసీఆర్‌ను మోత్కుపల్లి పొగడ్తలతో ముంచెత్తారు. దీనిని బట్టి ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని అర్ధం అవుతున్నది. ఇటీవలే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కారెక్కారు. ఇప్పుడు మోత్కుపల్లి కూడా కారెక్కబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది.