రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు మరోసారి బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది గ్రామంలో లక్ష్మీనరసిహస్వామి విగ్రహా పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుంటారని, కాలేశ్వరం ప్రాజెక్టుకు కొందరు నాయకులు కోర్టుల్లో కేసులు వేసినా, దేవుని దయతో మూడున్నర సంవత్సరాలలో పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.
రూ. 10 లక్షలతో యాగశాల నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గుర్రాల గొంది గ్రామంనికి రెండు సార్లు ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డు దక్కిందని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి జరుగుతోందని అవార్డులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వమే మాట మార్చుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణపై ప్రేమ ఉంటే రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలని ఆయన అన్నారు.