Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియడంతో, అధికారులు పోలింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు దాదాపు 28,278 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి కౌంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా, ఇటీవల ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం 3,834 సర్పంచ్, 27,600కు పైగా వార్డులకు జరిగిన తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అద్భుతమైన సత్తా చాటారు.
తొలి విడతలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా 2,872 స్థానాల్లో విజయం సాధించారు. పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ప్రకటించినా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతుదారులు కేవలం 1,160 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు.
బీజేపీ మద్దతుదారులు దారుణంగా కేవలం 195 స్థానాలకే పరిమితమయ్యారు. 460 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. తొలి విడత ఎన్నికల సందర్భంగా, కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు, తొలి విడత ఫలితాల జోరుతో రెండో విడత పోలింగ్‌కు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇక మూడో విడత ఎన్నికలకు పోలింగ్ ఈనెల 17న జరుగనుంది.
India-China: చైనా బిజినెస్ వీసాల వేగం పెంచిన భారత్.. కారణాలు ఇవే..