తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించారని ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.. అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్టీవీ తో జరిగిన ఇంటర్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. ఇందులో భాగంగా కేవలం రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి పార్టీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రతిపాదన చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న గాని ప్రజల సమస్యలు కేసీఆర్ కి కనబడటం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఎందుకు అడుగులు వేస్తున్నాడు. ఫెడరల్ స్ఫూర్తి పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాట్లాడే అర్హత కూడా లేదని ఈ సందర్బంగా కోమటిరెడ్డి మండిపడ్డారు. .
అయితే ప్రస్తుతం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది.. వచ్చే ఎన్నికల్లో మల్లి కాంగ్రెస్ ఏ అధికారంలోకి రావడం ఖాయం. ఇక భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే..అని తన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని ఆయన తెలిపారు.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిపాలన, శాంతిభద్రతలు విఫలమైందునే గవర్నర్ ప్రజాదర్భార్ నిర్వహించారు, అయితే గవర్నర్ చేస్తున్న దాంట్లో తప్పులేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన మహిళల పట్ల జరుగుతున్న దాడులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజలు విసిగిపోయారు. శాంతిభద్రతలు విఫలమైనందుకే గవర్నర్ నిర్వహించిన ప్రజాదర్బార్ విజయవంతమైందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.