కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై నిరసనజ్వాలలు దేశవ్యాప్తంగా రగులుతున్నాయి. అయితే నిన్న అగ్రిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సుమారు 2000 మంది ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించి, దాదాపు 8 రైళ్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లోని ఇతర సామాగ్రిని సైతం చెల్లాచెదురు చేశారు. మొత్తం 20 కోట్ల వరకు అస్తినష్టం వాటిల్లిందని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా ఈ ఘటనపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలని హితవు పలికారు.
బీజీపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, మోదీ ప్రభుత్వం దేశాన్ని అథోగతి పాలుచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా యువకులు కదం తొక్కారని ఆయన వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇది మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని ఆయన వెల్లడించారు. హింసకు తావు లేకుండా శాంతియుత పద్ధతుల్లో నిరసనలు తెలియజేయాలని ఆయన అన్నారు.