ధాన్యం కొనుగోలుపై తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు ఒకరిపైఒకరి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు చెబుతున్నారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యతేనని, తెలంగాణ నుండి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖ కేంద్రానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు.
వాళ్ల బియ్యం వాళ్లు తీసుకుపోకుండా పంపలేదని రాష్ట్రాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రా రైస్, పార్ బాయిల్డ్ రైస్ కు తేడా తెల్వని వాళ్లు బీజేపీ ఎంపీలని ఎద్దేవా చేశారు. పార్ బాయిల్డ్ (ఉప్పుడు బియ్యం) విధానం పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉన్న ఎఫ్‌సీఐయేనని, కేసీఆర్ ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్టలేదన్నారు. ఏడేండ్ల కాలంలో అత్యధిక శాతం కేంద్రం కొనుగోలు చేసింది పార్ బాయిల్డ్ బియ్యమేనని, ఇప్పుడు వంద శాతం బియ్యం సేకరించమనడం దుర్మార్గమని ఆయన అన్నారు.
రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఏమార్చే విధానం మంచిది కాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారని ఆయన పేర్కొన్నారు. దీనిని భవిష్యత్ లో 20 లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాలు ఉండాలి కానీ కేంద్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఎలాంటి కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదని ఆయన స్పష్టం చేశారు.