KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అయితే, విచారణకు మరింత సమయం కావాలని కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ ను ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే, ఈ విషయాన్ని కాళేశ్వరం కమిషన్ కు సమాచారం అందజేశారు కేసీఆర్.. గులాబీ బాస్ కోరిక ప్రకారం ఈ నెల 11వ తేదీన విచారణకు వచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది.
Read Also: Hardik Pandya: శ్రేయస్ బ్యాటింగ్ చూసి మతిపోయింది.. ఈ రోజు బూమ్ పేలలేదు!
అయితే, మరోవైపు, ఇవాళ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేపట్టిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాయీదా వేశారు. ఈ నెల 9వ తేదీన కమీషన్ ముందు హాజరు కానున్నారు.. అలాగే, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ ముందు విచారణకు వెళ్లనున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణ కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. కాగా, ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులను ఇప్పటికే అందజేసింది.