ఐపీఎల్ 2025 క్వాలిఫయర్- 2లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య ప్రశంసించాడు. శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని పరుగులు చేశాడన్నాడు. తమ బ్యాటర్లు మంచి స్కోరే చేశారని, బౌలింగ్ యూనిట్ రాణించలేకపోయిందన్నాడు. తమ బౌలర్లు సరైన లెంగ్త్ బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. సరైన సమయాల్లో జస్ప్రీత్ బుమ్రాను ఉపయోగించుకోలేకపోయాం అని హార్దిక్ తెలిపాడు. క్వాలిఫయర్- 2లో అదరగొట్టిన పంజాబ్ ఫైనల్ చేరితే.. ఓడిన ముంబై ఇంటిదారి పట్టింది.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. తమ ఓటమికి ప్రధాన కారణం బౌలింగే అని చెప్పాడు. ‘శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేసిన విధానం, అతడు ఆడిన కొన్ని షాట్లు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఓ సమయంలో శ్రేయస్ బ్యాటింగ్ చూసి నా మతిపోయింది. అవకాశాలను అతడు బాగా సద్వినియోగం చేసుకొని రన్స్ చేశాడు. పంజాబ్ బాగా బ్యాటింగ్ చేసింది, ఇది ఒప్పుకోవాల్సిందే. మా బ్యాటింగ్ బాగుంది. మంచి లక్ష్యాన్ని విధించాం. అయితే బౌలింగ్ యూనిట్‌గా విఫలమయ్యాం. ఇంకాస్త మంచి ప్రదర్శన ఇచ్చి ఉంటే బాగుండేది. ఇలాంటి పెద్ద మ్యాచులలో మంచి ప్రదర్శన అవసరం. పంజాబ్ బ్యాటర్లు ప్రశాంతంగా ఉండి.. మమల్ని ఒత్తిడిలోకి నెట్టారు’ అని హార్దిక్ చెప్పాడు.
‘మా ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. కీలక సమయంలో జస్ప్రీత్ బుమ్రా సేవలను సరిగా ఉపయోగించుకోలేకపోయాం. అతడిని కాస్త ముందుగా బౌలింగ్ చేయించాం. సరైన లెంగ్త్ బౌలింగ్ చేస్తే ఫలితం భిన్నంగా ఉండేది. 18 బంతులు మిగిలి ఉన్నపుడు బూమ్ జస్సీ కావచ్చు. బుమ్రా ప్రత్యేకంగా ఏదైనా చేయగలడు. అది ఈ రోజు జరగలేదు’ అని హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 212.20 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 41 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. మరోవైపు బుమ్రా 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు.