India-Iran History: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్ చరిత్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చరిత్రలో కొన్ని బంధాలు రక్తంతో కాకుండా సంస్కృతితో ఏర్పడతాయి. వేల ఏళ్ల క్రితం ఒకే అగ్ని ముందు నిలబడి ప్రార్థనలు చేసిన రెండు నాగరికతలు ఉన్నాయి. ఒకే భాషకు దగ్గరగా ఉన్న మాటలు, ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు, ఒకే సంప్రదాయాలను పంచుకున్న సంస్కృతులున్నాయి. కాలం వాటిని వేర్వేరు దారుల్లో నడిపించినా ఆ మూల బంధం మాత్రం ఇంకా చరిత్రలో కనిపిస్తూనే ఉంది. ఆ రెండు నాగరికతలు భారత్, ఇరాన్. ఒకప్పుడు ఆర్యుల భూములుగా గుర్తింపు పొందిన ఈ రెండు ప్రాంతాలు వేల సంవత్సరాల పాటు ఒకే సాంస్కృతిక కుటుంబానికి చెందినవిగా జీవించాయి.
వేదాల్లో వినిపించే యజ్ఞాగ్ని, జరోస్త్రియన్ సంప్రదాయంలో వెలిగే పవిత్ర అగ్ని.. ఈ రెండూ ఒకే ఆధ్యాత్మిక మూలాన్ని గుర్తుచేస్తాయి. దేవతల పేర్లలోనూ, భాషలలోనూ, ఆచారాలలోనూ ఒక ఆశ్చర్యకరమైన సామ్యం కనిపిస్తుంది. ఇంతకీ భారత్, ఇరాన్ మధ్య ఈ ప్రాచీన బంధం ఎలా ఏర్పడింది? అహురా, అసుర అనే భావనలు ఎందుకు ఒకే మూలం నుంచి పుట్టాయి? వేల సంవత్సరాల క్రితం విడిపోయిన ఈ రెండు నాగరికతలు ప్రపంచ చరిత్రను ఎలా ప్రభావితం చేశాయి? మిడిల్-ఈస్ట్ యుద్ధం వేళ భారత్‌తో ఇరాన్‌కు ఉన్న బంధంపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ఎందుకు జరుగుతుందో ఓసారి తెలుసుకుందాం!
భారత్, ఇరాన్ మధ్య ఉన్న ఈ బంధాన్ని అర్థం చేసుకోవాలంటే వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి. చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఆర్యన్ సంస్కృతి అనే ఒక ప్రాచీన నాగరికత నుంచి ఈ రెండు నాగరికతలు పుట్టుకొచ్చాయి.
Also Read
- Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
మధ్య ఆసియాలోని విస్తారమైన యూరేషియన్ మైదానాల్లో నివసించిన ఈ ప్రజలు తర్వాత రెండు దిశల్లో ప్రయాణించారు. ఒక వర్గం పర్షియన్ పీఠభూమి వైపు వెళ్లి ఇరానియన్ నాగరికతకు పునాది వేసింది. మరో వర్గం భారత ఉపఖండంలోకి వచ్చి వేద సంస్కృతిని నిర్మించింది. ఈ విభజన జరిగినా రెండు నాగరికతలు తమతో పాటు ఎన్నో పోలికలను తీసుకువచ్చాయి. ముఖ్యంగా అగ్ని పూజకు ఉన్న ప్రాధాన్యం అందులో ఒకటి. వేద సంప్రదాయంలో యజ్ఞం ప్రధాన ఆధ్యాత్మిక కర్మగా ఉంటే, జరోస్త్రియన్ సంప్రదాయంలో యస్నా అనే అగ్ని ఆరాధన ప్రధాన స్థానాన్ని పొందింది. ఈ రెండు పదాల మధ్య ఉన్న పోలిక కూడా ఈ నాగరికతల మధ్య ఉన్న ప్రాచీన సంబంధాన్ని గుర్తు చేస్తుంది. పార్సీల ఆరాధనా స్థలాలను ఇప్పటికీ ఫైర్ టెంపుల్స్ అని పిలుస్తారు.
దేవతల విషయంలో కూడా ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. జరోస్త్రియన్ మతంలో అత్యున్నత దేవుడు అహురా మజ్దా. అహురా అనే పదానికి అర్థం దేవుడు లేదా ప్రభువు. అదే పదాన్ని కొంచెం మార్చితే వేదాల్లో కనిపించే అసుర అనే పదం వస్తుంది. వేదాల్లో అసుర అనే పదం మొదట్లో దైవత్వాన్ని సూచించేది. వరుణుడు, ఇంద్రుడు లాంటి వారికి ఈ పదాన్ని ఉపయోగించేవారు. అయితే కాలక్రమంలో భారతీయ పురాణాల్లో అసుర అనే పదం ప్రతికూల అర్థాన్ని పొందింది.
ఇది మాత్రమే కాదు. మిత్ర అనే దేవత రెండు సంస్కృతుల్లోనూ కనిపిస్తుంది. వాయు, అపాం నపాత్, సోమ లేదా హోమ లాంటి భావనలు కూడా రెండు సంప్రదాయాల్లో కనిపిస్తాయి. ఈ పోలికలు కేవలం మతపరమైనవి మాత్రమే కాదు. భాషల్లో కూడా కనిపిస్తాయి. సంస్కృతం, అవెస్టన్, పర్షియన్ భాషల మధ్య అనేక పదాల్లో పోలిక కనిపించడం ఇందుకు ఉదాహరణ. అలాగే అవెస్టాలో కనిపించే హప్త హిందు అనే పదం వేదాల్లోని సప్త సింధు ప్రాంతాన్ని సూచిస్తుందని కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ వివరాలు ఒకప్పుడు ఇండో-ఇరానియన్ నాగరికత ఒకే భౌగోళిక ప్రపంచాన్ని పంచుకున్నట్టు చెబుతున్నాయి.
అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ రెండు నాగరికతలు వేర్వేరు మార్గాల్లో అభివృద్ధి చెందాయి. ఇరాన్‌లో జరోస్త్రియన్ మతం ప్రధానంగా ఎదిగింది. సైరస్ ది గ్రేట్ స్థాపించిన అఖేమెనిడ్ సామ్రాజ్యంలో జరోస్త్రియన్ మతం ప్రభావం పెరిగింది. ఆ కాలంలో పర్షియన్ సామ్రాజ్యం మెడిటరేనియన్ సముద్రం నుంచి ఇండస్ నది వరకు విస్తరించింది.
తర్వాత అలెగ్జాండర్ దండయాత్ర పర్షియన్ సామ్రాజ్యాన్ని దెబ్బతీసింది. అయినా కూడా పార్తియన్, ససానియన్ సామ్రాజ్యాల కాలంలో జరోస్త్రియన్ సంప్రదాయం మళ్లీ బలపడింది. కానీ ఏడో శతాబ్దంలో అరబ్ సైన్యాల దండయాత్రతో ససానియన్ సామ్రాజ్యం కూలిపోవడంతో ఇరాన్‌లో ఇస్లాం ప్రభావం ప్రారంభమైంది. ఈ పరిణామాల మధ్య జరోస్త్రియన్ మతాన్ని అనుసరించే అనేక మంది తమ మతాన్ని కాపాడుకోవడానికి ఇరాన్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. వారిలో కొందరు ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. తర్వాత వీరినే పార్సీలు అని పిలిచారు.
భారత్‌లోకి వచ్చిన ఈ సమాజం దేశ అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించింది. టాటా, గోద్రేజ్, వాడియా లాంటి పార్సీ కుటుంబాలు భారత పారిశ్రామిక రంగాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాయి. ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా లాంటి వారు భారత సైనిక చరిత్రలో నిలిచిపోయారు.
ఇప్పటికీ ప్రపంచంలో జరోస్త్రియన్ సమాజం చాలా చిన్నదిగా మారింది. దాదాపు లక్ష మందికి చేరువలో ఉన్న ఈ సమాజంలో సగం మంది ఇండియాలోనే నివసిస్తున్నారు. మరో భాగం ఇరాన్‌లో ఉంది. ఇరాన్‌లో ఇస్లాం ప్రధాన మతంగా మారినప్పటికీ పర్షియన్ సంస్కృతి ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. నౌరోజ్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఫరవహర్ అనే జరోస్త్రియన్ చిహ్నం పర్షియన్ గుర్తింపుగా ఉపయోగిస్తారు. పెర్సెపోలిస్ లాంటి ప్రాచీన స్థలాలు పర్షియన్ నాగరికత వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి. వేల సంవత్సరాల క్రితం వేర్వేరు దారుల్లో నడిచిన ఈ రెండు నాగరికతలు ప్రపంచ చరిత్రను కూడా ప్రభావితం చేశాయి. సిల్క్ రూట్ వాణిజ్యం ద్వారా విజ్ఞానం, వైద్యం, తత్వశాస్త్రం, గణితం లాంటి అనేక రంగాల్లో భారత్, పర్షియా మధ్య ఆలోచనల మార్పిడి జరిగింది. భారతీయ పంచతంత్రం పర్షియన్‌లోకి అనువాదం కావడం ద్వారా అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
ఇలా చరిత్ర వేర్వేరు మార్గాల్లో ఈ రెండు నాగరికతలను తీసుకెళ్లినా వాటి మూల బంధం మాత్రం చెదరలేదు. భాషలో, సంప్రదాయాల్లో, ఆచారాల్లో కనిపించే ఆ పోలికలు భారత్, ఇరాన్ మధ్య ఉన్న వేల ఏళ్ల నాగరికత బంధాన్ని ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!