Congress PAC- TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వజరీ కమిటీ ఈరోజు ( ఆగస్టు 23న) సాయంత్రం 5 గంటలకి కీలక సమావేశం కానున్నాయి. గాంధీ భవన్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జరగనున్న ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: US: న్యూయార్క్‌లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
అయితే, ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్రస్థాయి కమిటీల నిర్మాణం, యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి అని రాష్ట్ర సర్కార్ చూస్తుండగా.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండిపోయింది. కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాల వ్యక్తం చేయడంతోనే పీఏసీలో చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఎన్నికల తేదీలపై ఓ క్లారిటీ రానుంది. ఇదే అంశంపై మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు లాంటి అంశాలపై చర్చించి ఖరారు చేయనున్నట్లు సమాచారం.