నైరుతి రుతుపవనాలు కేరళను మూడు రోజుల ముందుగానే తాకాయి. అయితే రుతుపవనాల విస్తరణ మాత్రం నెమ్మదిగా జరుగుతోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం వెల్లడించారు.
జూన్ 6 నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న ఆయన.. హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని… పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ దిశ నుంచి గంటకు 10-15కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో ఇవాళ 42 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా మెదక్‌లో 25.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపింది.