Rayadurgam Cheating Case: రాయదుర్గంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఫోర్జరీ సంతకాలతో రాత్రికి రాత్రే వందల కోట్ల కంపెనీనే దొచేశారు ఇద్దురు కేటుగాళ్లు. దీంతో కంపెనీ యజమాని వెంకట్ కొల్లి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. నిందితులు స్వామీజీ కాకర్ల, రవికుమార్ దాపర్తిగా గుర్తింపు. కంపెనీ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకడైన రవికుమార్ దాపర్తిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న స్వామిజీ కాకర్ల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: Chiranjeevi: కేసీఆర్‌కు చిరంజీవి పరామర్శ.. చాలా సంతోషంగా అనిపించిందన్న చిరు!
పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఐదేళ్ల క్రితం రఘు కుమారి కొల్లి, లక్ష్మణ రావు యాడ్లపాటి ఒర్విన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ (Orwin Lab pvt Ltd) పేరుతో కంపెనీని ప్రారంభించారు. కంపెనీ డైరెక్టర్ రఘు కుమారి కొల్లి కుమారుడు వెంకట్ కొల్లిని నియమించారు. ఈ క్రమంలో కంపెనీ వ్యవహారాల మీద ఆరు నెలల క్రితం వెంకట్ కొల్లి అమెరికా వెళ్లాడు. 6 నెలల తర్వాత తిరిగి వచ్చిన వెంకట్ కొల్లికి షాకింగ్ ఘటన ఎదురైంది. తన కంపెనీని స్వామిజీ కాకర్ల, రవికుమార్ దాపర్తిలు అక్రమంగా తమ పేరు మీదకి మార్చుకున్నట్టు తెలిసింది.
డిజిటల్ ద్వారా వెంకట్ కొల్లి సంతకాలు ఫోర్జరీ చేసి.. డైరెక్టర్లుగా మారి కంపెనీకి చెందిన కోట్ల రూపాయలను దారి మళ్లించారు. దీంతో వెంకట్ కొల్లి వారిపై రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాడు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పిటికే నిందితుడు స్వామీజీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే వారు మరో కేసులో నిందితులుగా ఉన్నట్లు విచారణలో తేలింది. అమెరికాలో వీసాలు ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్లుగా కూడా స్వామీజీ, రవికుమార్‌లపై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.