Off The Record: ఏపీలో సీనియర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్‌కు 2024 ఎన్నికల ముందు ఉన్నట్టుండి ఖద్దరు మీద మోజు పెరిగింది. ఎన్నాళ్ళని వాళ్ళకి వీళ్ళకి సలాం కొడతాం…. అదేదో… మనమే కొట్టించుకుంటే పోలా… అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. తాను చేస్తున్న అఖిల భారత సర్వీస్ ఉద్యోగానికి ఒక్కటంటే.. ఒక్కరోజులోనే రాజీనామా చేసేసి… కేవలం ఒక్క పూటలోనే ఓకే స్టాంప్ వేయించుకున్నారు. అంతేనా… సార్ స్పీడ్ అక్కడితో ఆగలేదు. రాజీనామా ఆమోదం పొందీ.. పొందగానే…. వైసీపీ కండువా కప్పేసుకుని కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసుకున్నారు. ఆ మాటకొస్తే… ముందే టిక్కెట్ కన్ఫామ్ చేసుకుని తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారని చెప్పుకుంటారు కొందరు. రోజుల వ్యవధిలోనే ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అప్పటి వరకు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ మరోసారి టికెట్ కోసం పోరాటం చేస్తున్న టైంలోనే ఊహించని విధంగా మెరుపులీగలా రేస్‌లోకి వచ్చి ఎగరేసుకుపోయారు ఇంతియాజ్.
కానీ.. ఆయన అనుకున్నదొక్కటి, అయ్యింది మరొక్కటి. కూటమి వేవ్‌లో చాలా మంది వైసీపీ నాయకుల్లాగే… ఇంతియాజ్ అహ్మద్ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత యధావిధిగా వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ హోదాలో ఉన్నారాయన. మొదట్లో బాగా నారాజ్ అయ్యారట. తాను తీసుకున్న నిర్ణయం రైటా, రాంగా? అంటూ తెగ మధనపడిపోయేవారట. ఎందుకొచ్చిన రాజకీయాలు…. మంచి జీతం, జీవితం, ఏసీ రూములో కూర్చుని చేసే ఉద్యోగం… అన్నీ వదులుకుని చాలా నష్టపోయానంటూ బాధపడేవారని చెబుతారు ఆయన సన్నిహితులు. ఆ బాధ చూడలేని దగ్గరి వాళ్ళు చాలామంది రకరకాలుగా ఓదార్చారన్న ప్రచారం సైతం ఉంది. ఓడిపోతే ఓడిపోయారు….. రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్. ఇక సంగతి వదిలేసి… నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండండి. కేడర్‌కు అందుబాటులో ఉండండి…. ముందు ముందు మళ్ళీ అవకాశాలు రాకుండా పోవని చెప్పారట. కర్నూలులో ముస్లిం మైనార్టీలు బలంగా ఉండడంతో పార్టీ కోసం కష్టపడితే ఎప్పటికైనా ఛాన్స్ వస్తుందని చెప్పడంతో… కాస్త కుదుటపడి… కార్యకర్తల సమావేశం పెట్టి మరీ… మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఇంతియాజ్. కానీ… ఆ రోజు చెప్పిన మాట తప్ప… ఆరు నెలల నుంచి ఆయన అడ్రస్ లేరంటూ… డీలా పడుతోంది కర్నూలు వైసీపీ కేడర్. ఈ ఆరు నెలల్లో ఆరు రోజులు కూడా ఆయన అందుబాటులో లేరన్నది వైసీపీ కేడర్ మాట. జగన్ వచ్చినప్పుడో, లేదా ఇంకెవరైనా ముఖ్య నాయకులు వస్తేనో కర్నూలులో కనిపిస్తున్నారు తప్ప… పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఇంచార్జి హోదాలో రావడం లేదన్నది కార్యకర్తల ఫిర్యాదు. దీంతో ఇంతియాజ్‌ను కర్నూల్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఉంది పార్టీ వర్గాల్లో. పోనీ… ఆయనకు బదులుగా ఎవరన్నా ఇంట్రస్ట్‌గా ఉన్నారా అంటే… అదీ లేదట.
మంత్రి టీజీ భరత్ కర్నూల్ ఎమ్మెల్యే కావడంతో… ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ పదవి తీసుకుని లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? అదేదో.. ఆ టైం వచ్చినప్పుడు చూసుకుందాం.. అన్నట్టుగా చాలా మంది నాయకులు వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. అటు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా వైసీపీ అధికారం కోల్పోయాక మొత్తంగా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇటు ఇన్ఛార్జ్ అందుబాటులో లేక, అటు మాజీ ఎమ్మెల్యే రాక కర్నూలు వైసీపీకి దిక్కులేకుండా పోయిందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇలాంటి పరిస్థితుల్లో.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి భార్య విజయ మనోహరిని ఇన్చార్జిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల టైంలో పార్టీ టిక్కెట్ ఆశించారామె. ఇక ఇంతియాజ్‌కైతే పూర్తిగా మంగళం పాడేస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి కర్నూల్‌లో. అదే నిజమైతే… ఉన్నదీ పోయే…. అంటూ గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకునే మొరటు సామెత ఒకటి ఆయనకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎంత స్పీడ్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో..అంతకు మించిన స్పీడ్‌తో ఎగ్టిట్ అవుతారన్న మాటలు నిజమవుతాయా? లేక ఈ మాజీ ఐఎఎస్ రీఛార్జ్ అయి పొలిటికల్ ఛార్జ్ తీసుకుంటారా అన్నది చూడాలి.