Chiranjeevi visits KCR in Hospital : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చిరంజీవి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు, అంతేకాక కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలోని 9వ అంతస్తులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారిపడిన సంగతి అందరికీ తెలిసిందే. జారిపడగా తుంటి విరిగిన నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
KCR Health: కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కలిసి పరామర్శిస్తున్నారు. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పదిహేను నిమిషాల పాటు కేసీఆర్, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ తో కూడా మాట్లాడానని రేవంత్ అన్నారు. ఇక రేవంత్ రెడ్డి వెంట షబ్బీర్ అలీ, మంత్రి సీతక్కతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. ఇక ఈ రోజు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పరామర్శించారు. అంతకు ముందు భీమ్ ఆర్మీ చీఫ్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ మరియు బీఎస్పీ తెలంగాణ చీఫ్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ ను పరామర్శించారు.
ఇక పరామర్శ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ కేసీఆర్ గారిని పరామర్శించా, ఆయన ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారని అన్నారు. ఆయన 6 వారాల్లో కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు, సర్జరీ తరువాత 24 గంటల్లో ఆయనను నడిపించారని అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానని అన్నారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఇండస్ట్రీ ఎలా ఉంది అని ఆయన ఈ సమయంలో కూడా అడిగారు, దానికి చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి అన్నారు.