అమెరికా టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా ఇదే అంశంపై ఇటలీ ప్రధాని మెలోని స్పందించారు. తమ ఇద్దరి మధ్య స్నేహం ఉందని చెప్పుకొచ్చారు. తనకు చాలా మంది వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఎలాన్ మస్క్.. తనకు మంచి స్నేహితుడని మెలోని తెలిపారు. ఇతరులు మాత్రం.. వేరే రకంగా చూస్తున్నారని చెప్పారు. అలాగైతే తనకు చాలా మంది వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. గత సెప్టెంబరులో ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్న ఫోటో వైరల్ కావడంతో అపార్థాలకు తావిచ్చింది. ఇద్దరి మధ్య ఏదో ప్రేమ వ్యవహారం నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. వారిద్దరు న్యూయార్క్‌లో జరిగిన బ్లాక్-టై ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. మెలోనికి మస్క్ అవార్డును అందించారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మొత్తానికి ఇన్నాళ్లకు మెలోని క్లారిటీ ఇచ్చారు.
ఇటలీలో పెట్టుబడులు తీసుకురావాలనే ఆసక్తితో టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ బిలియనీర్ మస్క్‌తో మెలోని తరచుగా సమావేశమయ్యారు. మెలోని ప్రభుత్వం ఈ వేసవిలో ఇటలీలో విదేశీ అంతరిక్ష సంస్థలు పనిచేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించింది. ఇది 2026 నాటికి 7.3 బిలియన్ యూరోల ($7.7 బిలియన్) పెట్టుబడులను ఉత్పత్తి చేయనుంది.