రైతుల ఉసురు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులపై కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సీజన్‌లో ధాన్యం ఎంతయినా కొనాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, అయినా కేసీఆర్ వచ్చే సీజన్‌కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ ధరకు వడ్లు అమ్ముకొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులతో పెట్టుకున్న వారు ఎవ్వరూ ముందుకు పోలేదని కేసీఆర్ ఈ విషయాన్ని గమనించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కు తీసుకుని రైతులకు క్షమాపణలు చెప్పి హుందాగా వ్యవహరించిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ కూడా ఒక్క గింజ ధాన్యం కొననందుకు రైతులకు క్షమాపణలు చెప్పి, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రైతులు తెలివి తక్కువ వారు, వారికి చదువు రాదని, సంఘటితంగా ఉండరని సీఎం కేసీఆర్ భావిస్తున్నా రేమో.. కానీ, సమయం వచ్చినప్పుడు కేసీఆర్‌కు కర్రు కాల్చి వాత పెడతారని ఈటల హెచ్చరించారు.
ఈ వర్షకాలంలో పంట పండినా సరైన సమయంలో కొనకపోవడం వల్ల ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని, దీనికి పూర్తి బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదేనని ఈటల అన్నారు. నెల రోజులుగా రైతులు ఇబ్బం దులు పడుతూ ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని, రైతుల ఊసురు తగిలించుకోవద్దని నాలుగు రోజుల్లో రోడ్ల పై మీద ఉన్న ధాన్యాన్ని రాష్ర్ట ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేదంటే కలెక్టరేట్లను ముట్టడిస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు.