Gidugu Rudraraju: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారంలో ఏపీ, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు.
Also Read: Adimulapu Suresh: చంద్రబాబు బీసీలను 14 ఏళ్లు మోసం చేశారు..
ఏపీ బోర్డర్ నియోజకవర్గం కాబట్టి మేం మధిరలో ప్రచారానికి వచ్చామన్నారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ క్రెడిబులిటీ కోల్పోయారని.. ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చిన కేసీఆర్.. తన ఇంటిలో ఉన్న వారికే ఉద్యోగాలిచ్చుకున్నారని విమర్శించారు. కీలక పదవులు కేసీఆర్ ఇంట్లోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ ఇక పేలని తుపాకినే.. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ అబ్జర్వర్, మహారాష్ట్ర మాజీ మంత్రి గౌడ పేర్కొన్నారు. ప్రజల్లో ఉండే నేతలకే కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయించిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ లో ఉందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అన్నారు. మహిళలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నారని పద్మశ్రీ చెప్పారు.