కత్తిపూడి బహిరంగ సభలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెప్తున్నాడని.. నవంబర్, డిసెంబర్‌లలోనే ఎన్నికలు జరుగుతాయని పవన్ తెలిపారు.
సీఎం మూడు రాజధానులు అని నాటకాలు ఆడుతున్నాడని.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. గాజువాక నుండి తనను గెలిపించి ఉంటే వైజాగ్ దోపిడీ ఆపేవాడినని పవన్ పేర్కొన్నారు. గోదావరి ఈ నేలను విడిచి ఎలా వెళ్లలేదో.. పవన్ కళ్యాణ్ కూడా ఈ నేలను విడిచి వెళ్లలేడని తెలిపారు.
ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని ఆరోపించారు. ప్రజల్ని బాగా చూసుకుంటానంటే వైసీపీతో తనకు ఇబ్బంది లేదన్నారు. ఒక్క సీటు కూడా లేని జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ సభను నిర్వహించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గతంలో చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడని ప్రశ్నించారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే చంద్రబాబు అడ్డుకుని కేసులు పెట్టారని ఆరోపించారు.
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుదల, జగనన్న భూ హక్కు- భూ రక్ష కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ ఏర్పాటుపై కసరత్తులు చేస్తుంది. ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సి ఉంది. ఇప్పటికే కొత్త పీఆర్సీ కమిటీ కోసం ప్రభుత్వానికి విఙప్తి చేస్తున్నారు సచివాలయం ఉద్యోగుల సంఘం సహా ఇతర ఉద్యోగ సంఘాలు.
రాజకీయాల్లో సమాధులు వంటి మాటలు మాట్లాడవచ్చా.. అంటూ చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. మేం కాన్ఫిడెంట్ గా ఉన్నాం...తుది తీర్పు కూడా పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుందని.. చంద్రబాబు ఎవరిని కలిసి రమ్మంటున్నాడో చూద్దాం అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటు వేయటానికి మాత్రమే ఉన్నారా అంటూ చంద్రబాబును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమి అయినా పెదలకు ఇచ్చారా అని అడిగారు.