విశాఖ సి.ఆర్.జెడ్ ప్రాంతంలో నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. స్టేటస్ రిపోర్టును వెంటనే సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో సీ.ఆర్.జెడ్ నిబధనలను ఉల్లంఘించి జరుపుతున్న కాంక్రీట్ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిపింది.
నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పోలీసులు పెంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు కారాగారం వద్దకు పిన్నెల్లి అనుచరులు తరలివచ్చారు. విడుదలకు సంబందించిన సమయం ముగియడంతో పోలీసులు, పిన్నెల్లి అనుచరులు వెనుదిరిగారు.
అవినీతి లేకుండా పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి , వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో వరద బాధితులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హై పవర్ కమిటీ వేసి అందరికి న్యాయం చేస్తామన్నారు.
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లిలో గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 17500కిలో మీటర్లు సీసీ రోడ్లు వేస్తామన్నారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్‌ను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఓజిలి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.
సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల పీఎస్‌యూ కనెక్ట్-2024 సదస్సులో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. మహిళలు ఏ స్థాయిలో వున్నా ఒక మహిళగానే ఈ సమాజం చూస్తుందన్నారు. సీఎం చంద్రబాబు ఒక విజన్ వున్న లీడర్.. మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అంటూ కొనియాడారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం సహా రెండు కేసుల్లో పిన్నెల్లికి ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.