ఈ నెల 31వ తేదీన జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 31వ తేదీన అనగా రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది.. దీనిపై గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రేపటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను.. వారు కోలుకునేంత వరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను అన్నారు సీఎం జగన్
విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.. కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు కమిషన్ అధికారులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ.. ఓవైపు 20 గంటల తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి.. ఈ ప్రమాదంలో నిజ్జునుజ్జయిన ఏడు బోగీలను తొలగించారు.. విజయవాడ-విశాఖపట్నం అప్ లైన్ & డౌన్ లైన్ పనులు పూర్తి చేశారు.
చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మ్యానిఫెస్టోతో రాబోతుంది అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం 2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. గుంటూరులో రేపు జరిగే ఓబీసీ సంఘాల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.. అధికార దుర్వినియోగం, అందుకు తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీదా, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
ముసాయిదా ఓటర్లు జాబితా విడుదల నేపథ్యంలో ఓటర్ల జాబితాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఓటర్ల జాబితా అంశాలపై ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక ఇంఛార్జ్ నియామకం చేసేందుకు యోచిస్తుంది.
చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసింది అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి లోకేష్ కి లేవు అని మండిపడ్డారు.
ఉమ్మడి జిల్లాల వారీగా రేపట్నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సమన్వయ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.