Story Board: సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చివరకు బెనిఫిట్ షోలు రద్దు చేసేదాకా తెలంగాణ సర్కారు తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అసలు బెనిఫిట్ షోల చరిత్రేంటి..? వీటికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి..?వంటి ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో వికలాంగులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సీఎం సహాయనిధి కోసం బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇచ్చేవారు. ఆ బెనిఫిట్ షోల్లో వచ్చిన కలెక్షన్ ను సమాజ హితం కోసం వినియోగించేవారు. బెనిఫిట్ షోలు లేకపోయిన సమయంలో కూడా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీ ఆదుకునేది. ఇప్పుడు బెనిఫిట్ షో కలెక్షన్లు జూనియర్ ఆర్టిస్టులకు ఇస్తున్నారా.. మరేదైనా సమాజ హితం కోసం వినియోగిస్తున్నారా..? హీరోలు, నిర్మాతలు జేబుల్లో వేసుకుంటున్నారు. బెనిఫిట్ షోకు పెడుతున్న టికెట్ రేట్లు కూడా దారిదోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. ఈ దోపిడీని సర్కారు అరికట్టాల్సిందే.
భారీ బడ్జెట్లతో సినిమాలు తీసి.. హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్లు ఇచ్చేసి.. ఆ భారం తగ్గించుకోవటానికి బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు. హీరోలు మాత్రమే లాభపడటం కోసం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. బెనిఫిట్ షో పేరుతో అధికారికంగా టికెట్ రేటు రూ.1500 నిర్ణయిస్తున్నారు. ఈ రేట్లతో నలుగురు సభ్యులున్న కుటుంబం సినిమాకి వెళ్తే టికెట్లకే రూ.6 వేలు అవుతాయి. ఇక మిగతా ఖర్చులు రూ.4 వేలు వేసుకున్నా.. మొత్తం పది వేల రూపాయల క్షవరం తప్పదు. అంటే ఓ కుటుంబం సినిమాకి వెళ్లాలంటే రూ.10 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మొదటి మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లు లాగేయాలనే యావతో.. బెనిఫిట్ షోను తమ సొంత బెనిఫిట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. హీరోల రెమ్యూనరేషన్లు పెంచుకోవటానికి సామాన్యుడి ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఈ అడ్డగోలు దోపిడీకి కచ్చితంగా ఎక్కడోచోట అడ్డుకట్ట వేయాల్సిందే.
అట్టర్ ఫ్లాప్ సినిమాకు కూడా స్పెషల్ షోలు వేస్తున్నారు. సినిమా హిట్టో ఫట్టో జనానికి తెలిసేలోపే డబ్బులు లాగేస్తున్నారు. అసలు జనానికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఓ పెద్ద సినిమా రిలీజ్ ఉందంటే.. ముందే కృత్రిమ హైప్ క్రియేట్ చేసి.. జనాన్ని బాదేస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న ఈ భయంకర దోపిడీ సామాన్యుల్ని నలిగిపోయేలా చేస్తుంది. అసలు బెనిఫిట్ షోలు ఇవ్వాలని సర్కారుకు వినతిపత్రాలు ఇచ్చేరోజలు పోయి.. ఇప్పుడు ఏకంగా డిమాండ్లు చేస్తున్నారు. సర్కారు చెప్పినట్టు సినీ ఇండస్ట్రీ నడుస్తుందా.. లేకపోతే సినీ పరిశ్రమే సొంత నిబంధనలు పెడుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. హీరోల లాభం కోసం జనంపై టికెట్ల భారం మోపడం ఏం పద్ధతనేది తేలాల్సి ఉంది. ఏ సినిమాకి బెనిఫిట్ షోలు ఇవ్వాల్సిన పని లేదు. సినిమా బాగుంటే జనం చూస్తారు. లేకపోతే లేదు. అంతేకానీ ఇలా కృత్రిమ హైప్ సృష్టించి భారీ కలెక్షన్ల కోసం జిమ్మిక్కులు చేయడం సరికాదు. ఇప్పటిదాకా తెలిసో తెలియకో ప్రభుత్వాలు బెనిఫిట్ షోలను ప్రోత్సహించాయి. ఇప్పుడు సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి తమ ప్రకటనలకు గట్టిగా కట్టుబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు ఇవ్వకూడదు. ఏపీలో కూడా ఇదే విధానం అవలంబించాలి.
సినీ పరిశ్రమ సమాజంలో భాగమే. హీరోలేం అతీతులు కాదు. సినిమా పేరుతో సామాన్యుడికి వినోదం అందిస్తామని చెప్పి.. ఇలా జలగల్లా టికెట్ రేట్లు పెంచేసి.. జనం డబ్బు గుంజుతామంటే చూస్తూ ఊరుకోవాలా అనేది అసలు ప్రశ్న. బెనిఫిట్ షోల కలెక్షన్లు ఎవరి జేబులోకి పోతున్నాయో చెప్పే ధైర్యం ఇండస్ట్రీకి ఉందా అనేది మరో కీలకాంశం. బెనిఫిట్ షో టికెట్లను కొందరు సినీ పెద్దలే బ్లాక్ లో అమ్మడాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కచ్చితంగా సమాధానం చెప్పాలి. సినిమాల పేరుతో వ్యాపారం చేస్తూ.. అధిక లాభాల కోసం జనాన్ని ఇబ్బందిపెట్టడం పైశాచికత్వమే అవుతుంది. మామూలు టికెట్ రేట్లకే సరైన సినిమాని చూపించలేకపోతున్న సినీప్రముఖులు.. బెనిఫిట్ షో పేరుతో దోపిడీకి దిగటం కచ్చితంగా దిగజారుడుతనమే. బెనిఫిట్ షో విషయంలో తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని సామాన్యులు స్వాగతిస్తున్నారు. ఇకనైనా టికెట్ల పేరుతో జరుగుతున్న దోపిడీకి తెరపడుతుందని ఆశిస్తున్నారు. ఓ భారీ సినిమాను వేల థియేటర్లలో విడుదల చేసి.. మరో సినిమాకి ఛాన్స్ లేకుండా స్పెషల్ షోలు వేయటం కబ్జాపర్వమే. అలా జనాన్ని కన్ఫ్యూజ్ చేసి.. అట్టర్ ఫ్లాప్ సినిమాని కూడా అధిక రేట్లకు చూసేలా చేయడం నయవంచన. ఈ వంచన అరికట్టడానికే తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా.. అసలీ పని ఎప్పుడో చేయాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సినిమా వినోద సాధనం.
అలాంటి సినిమాని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. బెనిఫిట్ షోల రద్దుతో పాటు టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పడం కచ్చితంగా శుభపరిణామమే. ఇప్పటికైనా సినిమావాళ్లు కళ్లు తెరిచి వాస్తవంలోకి రావాలి. ఇప్పటికే సినిమావాళ్లు సర్కారు దగ్గర కావల్సినన్ని రాయితీలు తీసుకుంటున్నారు. ఇంకా టికెట్ రేట్లు పెంచమనడం అతే అవుతుంది. సినీ నటులపై ప్రేక్షకుల అభిమానాన్ని ఇప్పటికే చాలా దుర్వినియోగం చేశారు. సామాన్యుల కష్టార్జితాన్ని ఎడాపెడా దోచుకుని అనైతిక పద్ధతులకు తెరతీశారు. ఇంకా ఇదే అరాచకం కొనసాగాలనుకోవడం దుర్మార్గం అవుతుంది. ఇప్పటికైనా సర్కారు సినిమా దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇకపైనా ఇలాగే కఠినంగా వ్యవహరించి సినిమావాళ్లకి ముకుతాడు వేయాల్సిన అవసరం చాలా ఉంది.