ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీపై టీమిండియా స్పిన్నర్ చాహల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఏడాది మెగా వేలంలో తనను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఈ హామీని ఆర్సీబీ తుంగలో తొక్కిందని చాహల్ విమర్శలు చేశాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఈ ఆరోపణలు చేశాడు. తాను ఆర్‌సీబీ టీమ్‌లో ఉండాలంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో తాను ఆర్సీబీని వీడి మరో టీమ్‌కు ఆడతానని అసలు ఊహించలేదని చాహల్ అభిప్రాయపడ్డాడు. అంతగా తాను ఆర్సీబీతో అటాచ్‌మెంట్‌ను కలిగి ఉన్నట్లు గుర్తుచేసుకున్నాడు.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఒకరోజు ఆర్‌సీబీ డైరెక్టర్ మైక్ హెసెన్ తనకు ఫోన్ చేశాడని చాహల్ తెలిపాడు. జట్టులోకి ముగ్గురిని అంటే కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను రిటైన్ చేసుకుంటున్నామని చెప్పాడని.. తనను వేలంలో తిరిగి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. కానీ వాళ్లు తన కోసం ఒక్క బిడ్ కూడా వేయలేదని చాహల్ వాపోయాడు. తనను రిటైన్ చేసుకోండని ఫ్రాంచైజీని తాను అడగలేదు.. రిటైన్ చేసుకుంటామని వాళ్లు కూడా తనకు చెప్పలేదన్నాడు. ఒకవేళ తనను రిటైన్ చేసుకుంటామని అడిగితే కచ్చితంగా ఒప్పుకునేవాడిని అని చాహల్ వివరించాడు.