IND Vs SA: కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం నాడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం అటు విరాట్ కోహ్లీ అభిమానులు, ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు పోటాపోటీగా కటౌట్లు ఏర్పాటు చేయడం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలో తొలుత విరాట్ కోహ్లీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే రోహిత్ కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కటౌట్‌లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… విరాట్ వర్సెస్ రోహిత్ ఫ్యాన్స్ మాత్రం గొడవకు దిగుతున్నారు. తమ ఆటగాడి కటౌటే బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్ కోహ్లీ కటౌట్ చూసి రోహిత్ శర్మ డబ్బులు పంపించాడా అంటూ కోహ్లీ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Read Also:Free Ration Scheme: గుడ్ న్యూస్.. మరో మూడు నెలల పాటు ఫ్రీ రేషన్ పథకం.
మరోవైపు ఈ మ్యాచ్‌లో గాయపడ్డ దీపక్ హుడా స్థానంలో సెలక్టర్లు ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్‌ను, హార్దిక్ పాండ్యా స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం కల్పించారు. అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుండగా సఫారీలతో జరగనున్న టీ20 సిరీస్‌ను టీమిండియా మేనేజ్ మెంట్ సన్నాహకంగా భావిస్తోంది. ఇప్పటికే సొంతగడ్డపై పటిష్ట ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ తన ఫామ్ కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.