Rishabh Pant About DC vs SRH Match: టాస్ విషయంలో తాను పొరపాటు చేశానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడమే తమ కొంపముంచిందన్నాడు. పవర్ ప్లేనే మా ఓటమిని శాసించిందని చెప్పాడు. వచ్చే మ్యాచ్‌లలో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం అని పంత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 67 పరుగుల తేడాతో ఓడింది.
మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ… ‘మంచు ప్రభావం ఉంటుందని భావించి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా. కానీ మంచు ఏ మాత్రం రాలేదు. మేము సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 220-230 పరుగులకు కట్టడి చేస్తే గెలిచే అవకాశం ఉండేది. పవర్ ప్లేనే ఇద్దరి మధ్య తేడా. పవర్ ప్లేలో సన్‌రైజర్స్ 125 పరుగులు చేసింది. తర్వాత మేం కట్టడి చేశాం. రెండో ఇన్నింగ్స్‌లో బంతి ఎక్కువగా ఆగుతూ వచ్చింది. మేం ఊహించినదాని కంటే పిచ్ స్లో అయ్యింది’ అని అన్నాడు.
Also Read: DC vs SRH: బౌలింగ్ చేయాలంటే బయమేసింది: ప్యాట్ కమిన్స్
‘260-270 పరుగుల లక్ష్యాన్ని ఛేధించాలంటే ధాటిగా ఆడాలి. మాకు ఆరంభం దక్కినా ఆ తర్వాత వికెట్స్ కోల్పోయాం. పవర్ ప్లేనే మా ఓటమి కారణం. టోర్నీలో మేం మరింత స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. జట్టుగా కోరుకున్న విధంగా అతడు ఆడాడు. విజయం సాధించాలంటే అందరూ బాగా ఆడాలి. మా తప్పిదాలను సరిచేసుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం’ అని రిషబ్ పంత్ తెలిపాడు.