క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఆదివారం టీమిండియా, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో వరుసగా రెండు మ్యాచ్‌లో విజయం సాధించి తొలిస్థానంలో ఉంది టీమిండియా. ఇక పాక్ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. వరుసగా రెండింటిలో ఓడిన హాంకాంగ్ ఆసియాకప్ నుంచి వెళ్లిపోయింది. దీంతో తొలిరెండు స్థానాల్లో ఉన్న టీమిండియా, పాక్ మరోసారి పోటీపడబోతున్నాయి. ఈ హైవోల్టేజ్ సమరానికి టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లో గెలిచి ఫుల్ జోష్‌లో ఉంది. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమైన కేఎస్ రాహుల్‌ను పక్కనపెట్టే ఛాన్స్ ఉంది. అతడి ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్‌ను టీమ్‌లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
Read Also: US Open 2022: యూఎస్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ ఓటమి.. అనంతరం క్రీడకు వీడ్కోలు
మరోవైపు.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు జడేజా దూరమవ్వడం ఫ్యాన్స్‌లో నిరాశ కల్గిస్తోంది. మోకాలి గాయంతో మిగితా టోర్నీలకు జడేజా దూరమైనట్లు బీసీసీఐ తెల్పింది. గత రెండు మ్యాచుల్లోనూ ఇరగదీశాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. జడ్డు స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకునే అవకాశం ఉంది. పాక్ కూడా మంచి ఫామ్‌లోకి వచ్చినట్లే కన్పిస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియాను ఓడించినంత పనిచేసింది. రెండో మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టింది. ఈ రెండు జట్లు బలంగా కన్పిస్తున్నాయి. దీంతో ఆదివారం క్రికెట్ ఫ్యాన్స్ మంచి వార్‌ను చూసే అవకాశం ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. ఫ్యాన్స్‌లో ఓ ఉత్కంఠ ఉంటుంది.. ఇక, విజయం సాధించిన తర్వాత ర్యాలీలు, డ్యాన్సులు.. బాణాసంచా కాల్చడం లాంటి ఘటనలు సర్వ సాధారణమైన విషయమే. ఈ మ్యాచ్‌ల్లో ప్రతీ బాల్ ఉత్కంఠగానే సాగుతుంది. మొత్తంగా భారత్-పాక్ మ్యాచ్ అంటేనే.. క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన పండుగ మరి..