Gujarat Titans Scored 80 Runs In 10 Overs: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. లక్ష్యంవైపు దూసుకెళ్తోంది. మొదటి నుంచే పరుగుల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. ఆరు ఓవర్ల పవర్ ప్లేలో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ ఎడాపెడా బౌండరీలు బాదేశారు. అయితే.. 48 పరుగుల వద్ద ఒక షాట్ కొట్టబోయి సాహా ఔటయ్యాడు. రబాడా వేసిన టెంప్టింగ్ బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నించగా.. అది గాల్లోకి ఎగిరి, బౌండరీ లైన్ వద్ద నేరుగా ఫీల్డింగ్ చేతికి చిక్కింది. దీంతో.. సాహా (30) పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అయితే.. సాహా ఔటయ్యాక గుజరాత్ జోరు కాస్త నెమ్మదించింది. సాయి సుదర్శన్ భారీ షాట్ల జోలికి వెళ్లకుండా, ఆచితూచి ఆడుతున్నాడు. మరోవైపు.. శుభ్మన్ గిల్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు.
దీంతో.. మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 74 పరుగులు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం మరీ పెద్దది కాదు కాబట్టి.. గుజరాత్ సునాయాసంగానే దాన్ని ఛేధించే ఆస్కారం ఉంది. అందుకే.. బ్యాటర్లు భారీ షాట్ల జోలికి వెళ్లడం లేదు. ఒత్తిడికి గురయ్యేంత పరిస్థితి లేకపోవడంతో.. నిదానంగానే తమ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్, సాయి సుదర్శన్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికొస్తే.. రబాడా ఒక వికెట్ తీశాడు. మిగిలిన బౌలర్లు ఇంకా ఖాతా తెరువలేదు. అర్ష్‌దీప్ సింగ్ ఎక్కువ పరుగులే సమర్పించుకున్నాడు. మిగిలిన వాళ్లు పొదుపుగానే బౌలింగ్ వేశారు.