గత ఐపీఎల్ సీజన్‌లతో పోలిస్తే.. ఈసారి ఐపీఎల్ అంచనాలకు భిన్నంగా చాలా రసవత్తరంగా సాగుతోందని చెప్పుకోవచ్చు. రెండు కొత్త జట్ల రాకతో మొత్తం రూపురేఖలే మారిపోయాయి. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఇతర జట్లలోకి జంప్ కావడంతో స్ట్రాంగ్‌గా ఉండే టీమ్స్ బలహీన పడ్డాయి. ఉదాహరణకు.. ముంబై ఇండియన్సే తీసుకోండి. ఐదుసార్లు కప్ గెలిచిన ఈ జట్టు ఈ సీజన్‌లో మాత్రం ఇంతవరకూ ఖాతా తెరవలేదు. టీమ్ స్ట్రాంగ్ గానే ఉన్నా, ఆటగాళ్లే సరైన ఆటతీరు కనబర్చడం లేదు.
అటు చెన్నై సూపర్ కింగ్స్ సైతం నాలుగు వరుస పరాజయాల తర్వాత ఒక విజయం సాధించింది. రానున్న మ్యాచుల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తుందా అంటే బలంగా ఏదీ చెప్పలేం. అయితే.. అత్యంత బలహీన జట్టుగా ఐపీఎల్ చరిత్రలో ముద్ర వేయించుకున్న హైదరాబాద్ జట్టు మాత్రం ఈసారి చమత్కారాలు సృష్టిస్తోంది. నాలుగు మ్యాచులాడిన ఈ జట్టు, తొలుత రెండు మ్యాచులు ఘోరంగా ఓడినా, ఆ తర్వాత వరుసగా రెండు విజయాల్ని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ జట్టులోని ఆటగాళ్లు మెల్లగా ట్రాక్‌లోకి వస్తున్నారని చెప్పొచ్చు.
ఇక ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్, కోల్‌కతా జట్టు.. ఎప్పట్లాగే తమ మంచి ప్రదర్శనతో దూసుకెళ్తున్నాయి. లక్నో టీమ్ కూడా అంచనాలకు మించి సత్తా చాటుతోంది. అయితే.. గుజరాత్ జట్టు మాత్రం అద్భుతాలే సృష్టిస్తోంది. ఇప్పటిదాకా 5 మ్యాచులు ఆడగా, నాలుగు విజయాలతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టుకి తిరుగులేదు. ప్రతి ఆటగాడు తమ బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడు. ఒక్క హైదరాబాద్ జట్టు చేతిలో పరాభావం చవిచూసిన ఈ జట్టు.. ఇతర జట్లను మట్టికరిపించింది.
గుజరాత్ టీమ్ సునాయాసంగా టాప్-4లో, అది కూడా అగ్రస్థానంలో నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కోల్‌కతా, రాజస్థాన్, పంజాబ్ జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాలకు చేరుకుంటాయని భావిస్తున్నారు. మిగతా జట్ల ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ.. ఈ నాలుగు జట్లు మాత్రం నిలకడగా రాణిస్తుండడం చూస్తుంటే, వీటి మధ్య చివర్లో హోరాహోరీ పోరు కొనసాగనున్నట్టు స్పష్టమవుతోంది. అయితే అంచనాలకు అందని ఐపీఎల్ టోర్నీలో ఎలాంటి అద్భుతాలైనా చోటు చేసుకోవచ్చు.