Danish Kaneria Fires On Babar Azam: ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని మాజీలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జట్టు వైఫల్యాలు, అలాగే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చేసిన తప్పులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సైతం బాబర్‌పై ధ్వజమెత్తాడు. బాబర్ స్వార్థం వల్లే పాక్ జట్టు నష్టపోతోందని.. ఇప్పటికైనా తన మొండితనం వీడి, జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలన్నాడు. నిస్వార్థంగా ఎలా ఉండాలో.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలని సూచించాడు.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ‘‘బాబర్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నాడు. ఓపెనింగ్ స్థానాన్ని జిడ్డులా పట్టుకుని వేలాడుతూ.. జట్టుకు నష్టం చేకూరుస్తున్నాడు. అతడు తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కరాచీ కింగ్స్‌తో ఉన్న సమయంలోనూ బాబర్ ఇలాగే ప్రవర్తించాడు. నిజానికి బాబర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయలేదు. అందుకే, ఓపెనర్‌గానే బరిలోకి దిగాలని మొండిగా ప్రవర్తిస్తున్నాడు. బాబర్ ఇలాగే వ్యవహరిస్తే.. పాక్ జట్టుకి కీడు చేసినవాడు అవుతాడు. సరే, ఓపెనర్‌గా బరిలో దిగడం తప్పు లేదు కానీ, మరీ ఇంత నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఎలా?’’ అంటూ కనేరియా ఏకిపారేశాడు. ఓపెనర్‌గా వచ్చినప్పుడు ఆరంభం నుంచి దూకుడుగా ఆడితే, జట్టుకి ప్రయోజనం చేకూరుతుందని.. అలా కాకుండా నెమ్మదిగా ఆడితే, టీ20 వరల్డ్‌కప్‌లో నమోదైన ఫలితాలే రిపీట్ అవుతాయంటూ చెప్పుకొచ్చాడు. ః
ఇదే సమయంలో.. జట్టు ప్రయోజనాల కోసం ఎలా ఆలోచించాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలని డానేష్ కనేరియా హితవు పలికారు. ‘‘క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ లాంటి నిస్వార్థపరుడు ఇంకొకరు ఉండరని చెప్పుకోవడంలో సందేహమే లేదు. తన సారథ్యంలో వరల్డ్‌కప్ ట్రోఫీ చేజారవడంతో, అతడు బలిపశువయ్యాడు. అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జట్టులో అతడి స్థానం గురించి ఎన్నో ప్రశ్నలు వచ్చినప్పటికీ.. కోహ్లీ నిరాధ చెందలేదు. కొత్త కెప్టెన్‌కు సహకారం అందిస్తూ.. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రమ్మంటే ఆ స్థానంలో వస్తున్నాడు. జట్టు కోసం ఏం చేయాలో, అదంతా చేస్తున్నాడు’’ అంటూ డానేష్ ప్రశంసలు కురిపించాడు.