హీరో సుశాంత్ ఇప్పుడు బ్రాడ్ గా ఆలోచిస్తున్నాడు. కేవలం హీరో పాత్రలకు పరిమితం కాకుండా ఆ మధ్య ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేశాడు. అలానే ప్రస్తుతం రవితేజ ‘రావణాసుర’లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే… వెండితెరకే పరిమితమైపోకుండా ఇప్పుడు ఓటీటీ బాట కూడా పట్టాడు. అతను నటించిన ‘మా నీళ్ళ ట్యాంక్’ వెబ్ సీరిస్ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ పొన్ను ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించిన ఈ వెబ్ సీరిస్ ను ‘వరుడు కావలెను’ ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేశారు.
రాయలసీమలోని ఓ కుగ్రామంలో జరిగే కథ ఇది. ఒకే కుటుంబానికి చెందిన మాజీ సర్పంచ్ నరసింహం (రామరాజు), ప్రెజెంట్ సర్పంచ్ కోదండం (ప్రేమ్ సాగర్)కు మధ్య అధిపత్య పోరు సాగుతూ ఉంటుంది. వరసకు మామా అల్లుళ్ళు అయ్యే వీరు పైకి కలిసి మెలిసి ఉంటారు కానీ ఒకరి వెనుక ఒకరు గోతులు తీసుకుంటుంటారు. ఆ ఊరిలో ఎంతోకాలంగా రిపేర్ లో ఉన్న నీళ్ళ ట్యాంక్ సెంటర్ పాయింట్ గా వీళ్ళ రాజకీయం సాగుతూ ఉంటుంది. ఇదే సమయంలో కోదండం కొడుకు గోపాల్ (సుదర్శన్) తాను ప్రేమించిన సురేఖ (ప్రియా ఆనంద్) కనిపించకుండా పోయిందని, ఆమెను తన తండ్రే కిడ్నాప్ చేశాడని, ఆమె తిరిగి ఊరిలోకి వచ్చే వరకూ తాను నీళ్ళ ట్యాంక్ పై నుండి కిందకు దిగి రానని శపథం చేస్తాడు. సురేఖను వెతికి తీసుకొచ్చే బాధ్యతను ఆ ఊరి నుండి ఎప్పుడెప్పుడు ట్రాన్స్ ఫర్ చేసుకుని పోదామా అని ఎదురుచూస్తున్న ఎస్. ఐ. వంశీ (సుశాంత్)కి సర్పంచ్ అప్పగిస్తాడు. సురేఖను వెతికి తెచ్చే పనిలో ఆమెతో వంశీనే ప్రేమలో పడిపోతాడు. మరి సురేఖను తీసుకొచ్చి వంశీ గోపాల్ కు అప్పగించాడా? సర్పంచ్ పదవిపై కన్నేసిన నరసింహం కోరిక నెరవేరిందా? పదవిని అడ్డం పెట్టుకుని ఊరిని, ఊరి జనాలను దోచుకున్న రాజకీయ నేతలకు ఎవరు? ఎలా బుద్ధి చెప్పారు? అనేదే ఈ వెబ్ సీరిస్ మిగతా కథ.
పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్తూరు ప్రాంతంలో ఈ కథ జరిగినట్టు చూపడంతో పాత్రధారులంతా అదే యాసను మాట్లాడారు. ఆ పల్లెపదాలన్నీ వినసొంపుగా ఉన్నాయి. కొన్ని పాత్రలతో పల్లెటూరి జాణతనం, మొరటుతనాన్ని కూడా బాగానే పలికించారు. వెబ్ సీరిస్ లకు సెన్సార్ లేకపోవడంతో కొన్ని మాటలు, దృశ్యాలు కూడా హద్దు మీరి ఉంటున్నాయి. కానీ ఇందులో అలాంటి ఇబ్బంది ఏదీ లేదు. ఒకటి రెండు చోట్ల సంభాషణలు అతిగా ఉన్నా పాత్రోచితం అని సరిపెట్టుకోవచ్చు. బట్… ఓ చిన్న పాయింట్ తీసుకుని ఎనిమిది ఎపిసోడ్స్ వెబ్ సీరిస్ గా మలచడం మాత్రం దారుణమనిపిస్తుంది. ఈ మొత్తం కథను నాలుగైదు ఎపిసోడ్స్ లో చెప్పేయొచ్చు. హీరో, హీరోయిన్లు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఎనిమిదో ఎపిసోడ్ వరకూ వేచి ఉండటం సబబుగా అనిపించదు. దాంతో చివరి అరగంటలో హడావుడిగా కథను కంచికి చేర్చేశారు. మరింత షార్ప్ గా ఎడిటింగ్ చేసుకుని, పునరుక్తాలను తగ్గించుకుంటే ఈ వెబ్ సీరిస్ చకచకా సాగిపోయేది. పైగా ఎపిసోడ్ పూర్తి కాగానే, మరో ఎపిసోడ్ కు వెళ్ళాలనే ఆసక్తిని ఏ మాత్రం కలిగించలేదు. దాదాపు నాలుగు గంటల నిడివిలో వెబ్ సీరిస్ తీసేసి, ఎనిమిది భాగాలుగా విడగొట్టినట్టుగా ఉంది.
‘మా నీళ్ళ ట్యాంక్’ లో మహిళలు కోరుకునే సాధికారికతను కథానాయిక సురేఖ పాత్ర ద్వారా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చెప్పిన తీరు బాగుంది. అదే సమయంలో ఆడవారిలో ఉండే అసూయ, లోభం, సంకుచితత్త్వంను ఇతర పాత్రల ద్వారా చూపించారు. ఏ వ్యక్తి పూర్తిగా మంచిగానో, పూర్తి గా చెడ్డగానో ఉండరనేది వాస్తవం. అవసరాలు, అవకాశాలు, వాళ్ళు పెరిగిన వాతావారణం వారిని అలా ప్రవర్తించేలా చేస్తాయి. ఆ సూత్రమే ఇందులోని ప్రతి పాత్రకూ వర్తింప చేశారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. అయితే కొన్ని పాత్రలను మాత్రం పూర్తి స్థాయిలో చెడ్డగానే చూపించారు. అవన్నీ గోముఖ వ్యాఘ్రాలు. ఇందులో హీరో అంటూ ఎవరూ లేరు. సుశాంత్ పోషించిన వంశీ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా కీలకమైంది తప్పితే అందులో హీరోయిజం అనేది ఉండదు. నిజానికి పల్లెటూరిలో ఎస్.ఐ. అంటే ఎంత పవర్ ఫుల్ గా ఉండాలి! అతన్ని కూడా సర్పంచ్ కు చెంచాలా చూపించడం బాగా అనిపించదు. సురేఖను వెతికి తీసుకొచ్చే క్రమంలో అతను ఆడే అబద్దం, ఆ తర్వాత ఆత్మన్యూనతతో బాధపడటంతో ఆ పాత్ర మరింతగా బలహీన పడింది. సుశాంత్ కు కొద్దొ గొప్పో ఇమేజ్ అనేది ఒకటుంది. దానిని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను ఇంకాస్తంత బెటర్ గా రాసుకుని ఉండాల్సింది. అలా చేసి ఉంటే… ఈ వెబ్ సీరిస్ కు మరింత ఆదరణ లభించేది.
నటీనటుల విషయానికి వస్తే… సుశాంత్ కు ఇది కాస్తంత భిన్నమైన పాత్ర అనే చెప్పాలి. పల్లెటూరి నేపథ్యంలో చేతకాని పోలీస్ పాత్రను అతను ఇంతవరకూ చేయలేదు. సురేఖ పాత్రలో ప్రియా ఆనంద్ చక్కగా ఇమిడిపోయింది. దాదాపు పదేళ్ళ తర్వాత ఆమె తిరిగి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పైగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం అభినందించదగ్గది. ఆమె చెల్లిగా చేసిన దివి చాలా యాక్టివ్ గా నటించింది. గోపాల్ గా సుదర్శన్ బోలెడంత కామెడీని అందించాడు. అతని తండ్రిగా ప్రేమ్ సాగర్ చక్కగా నటించాడు. అతని వాచకం బాగుంది. గోపాల్ తల్లిగా నిరోష, తాతగా రామరాజు చక్కగా యాక్ట్ చేశారు. హీరోయిన్ తల్లిదండ్రులుగా అప్పాజీ అంబరీష, బిందు చంద్రమౌళి సహజ నటన ప్రదర్శించారు. ఈ వెబ్ సీరిస్ లో మరో చెప్పుకోదగ్గ పాత్ర అన్నపూర్ణమ్మది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో వినోదప్రధానమైన పాత్రలు పోషిస్తున్న అన్నపూర్ణమ్మ ఇందులోనూ అదే తరహా ఎంటర్ టైనింగ్ క్యారెక్టర్ చేశారు. ఇతర కీలక పాత్రలను వాసు, సుదీప్ వారణాసి, లావణ్య రెడ్డి తదితరులు పోషించారు. పల్లెటూరి కథ కావడంతో భారీతనానికి పోకుండా, లిమిటెడ్ బడ్జెట్ లో తీసినట్టు అనిపిస్తోంది. ఓవర్ ఆల్ గా కామెడీని ఇష్టపడే వారికి ఇది నచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే… కాస్తంత ఓపిక చేసుకుని చూడాలి!!
రేటింగ్: 2.25 /5
ప్లస్ పాయింట్స్
పల్లెటూరి కథ కావడం
వినోదానికి పెద్ద పీట వేయడం
ఆకట్టుకునే సంభాషణలు
మైనెస్ పాయింట్స్
పేలవంగా హీరో క్యారెక్టరైజేషన్
సహనానికి పరీక్ష పెట్టే రన్ టైమ్
నిర్మాణ విలువలు లేకపోవడం
ట్యాగ్ లైన్: నీళ్ళు లేని ట్యాంక్!