స్వర్ణాంధ్ర నా సంకల్పం.. విజన్ 2047 కోసం పనిచేస్తున్నా..
స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు.. కానీ, ఇప్పుడు అర్థం అవుతోందన్న ఆయన.. ఇప్పుడు తాను విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అన్నారు.. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంపద సృష్టించినా ఆనందంగా ఉండటం ముఖ్యం.. ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యం.. స్వామీజీ పై పెట్టిన నమ్మకంతో కొంత పాలకులైన నాపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తాం.. అందరూ యదార్థములని కూడా చెప్పేలా ఉండాలి అన్నారు.. ఇక, ప్రతి ఒక్కరికీ స్పిరిచువాలిటీ ఉండాలి అన్నారు సీఎం చంద్రబాబు.. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలి.. గణపతి సచ్చిదానంద ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు.. నేను కష్టాల్లో ఉన్నపుడు పూజ చేసి ఫలితాన్ని నా చేతికి ఇచ్చారు.. మంచికోసం స్వామీజీ పరితపిస్తారు.. స్వామీజీని ఎప్పుడు కలిసినా మనశ్శాంతి దొరుకుతుందని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. పీఠాధితుల ఆశీర్వచనం తీసుకున్నారు.. ఆ తర్వాత 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
చైనాలో కొత్త వైరస్.. స్పందించిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ వెలుగు చూసింది.. అంతేకాదు.. వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV)పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. చైనాలో కొత్త వైరస్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయి.. అధికారికంగా ధ్రువీకరణ జరగలేదన్న ఆయన.. ఇలాంటి వైరస్ వస్తే మొదట కేంద్రం స్పందిస్తుందన్నారు.. ఒక వేళ వైరస్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయని తెలిపారు..
జేసీపై సత్యకుమార్ కౌంటర్ ఎటాక్.. మాటలు కంట్రోల్‌లో ఉండాలి..!
టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్.. కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అని ఎద్దేవా చేసిన ఆయన.. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని సూచించారు.. అయితే, ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని పేర్కొన్నారు.. ఎక్కడో బస్సు కాలిస్తే బీజేపీకి ఏం సంబంధం..? అని నిలదీశారు.. బీజేపీ దేశవ్యాప్తంగా పరిపాలిస్తున్న పార్టీ.. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సులపై, వ్యాపారాలపై, అనేక ఆరోపణలు ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడబోన్నారు.. కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ గురించి ఇలా మాట్లాడకూడదు అని హితవు చెప్పారు.. వ్యక్తిగత సమస్యలు తీసుకువచ్చి, రాష్ట్ర సమస్యలాగా మాట్లాడకూడదు.. అర్థంపర్థం లేని విమర్శలు, బీజేపీ మీద చేయడం సరికాదన్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఎవరికైనా మాటల్లో కంట్రోల్ ఉండాలన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. అంతేకాదు వైఎస్ జగన్ పై ప్రేమ ఉంటే ఆయన దగ్గరకు వెళ్లవచ్చు అంటూ సలహా ఇచ్చారు.. ఎప్పుడు కాంట్రవర్సీ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరుకుంటారని దుయ్యబట్టారు.. మాధవిలత కేవలం మహిళలు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పారని గుర్తుచేశారు.. ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో జేసీ చెప్తారా..? అని నిలదీశారు.. మాకు వివాదాలు అవసరం లేదు.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రగతి పథంలో ఉంది.. ఇలాంటి పరిస్థితి మంచిది కాదని సూచించారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వమని, రైతు భరోసా లో కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎందరు ప్రభుత్వం దగ్గర డేటా ఉందని, దద్దమ్మ ప్రభుత్వం… రైతుల నుండి దరఖాస్తులు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఫసల్ భీమా ఊసే లేదు.. రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతుల మీద అక్రమ కేసులు పెట్టీ… రైతులకు సంకెళ్లు వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, అప్పుడు బీఆర్‌ఎస్ రైతులకు సంకెళ్లు వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వేస్తుంది సంకెళ్ళ్ళు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచినీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
రాబోయే 25 ఏండ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడే మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని అన్నారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం హైదరాబాద్ జల మండలి బోర్డు సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోర్డు సమావేశమవటం ఇదే తొలిసారి. బోర్డు ఛైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ ఆప్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం.. ప్రచారంలో కూడా దూసుకుపోతోంది. ఇంకోవైపు కొత్త కొత్త పథకాలు ప్రకటించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బీజేపీ కూడా ఎన్నికల శంఖారావానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రధాని మోడీ… ఢిల్లీలో గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించారు. మురికవాడ ప్రజలకు ఇళ్లు పంపిణీ చేశారు. దీంతో హస్తినలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లైంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తొలి జాబితాను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తుండగా.. వీరేంద్ర సచ్‌దేవ్ మాత్రం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైకమాండ్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుండగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
న్యూ ఓర్లీన్స్ నిందితుడి ఇంట్లో దిగ్భ్రాంతికర వస్తువులు.. తెరిచి ఉన్న ఖురాన్‌లో ఏముందంటే..!
అగ్ర రాజ్యం అమెరికాలో జరిగిన వరుస ఉగ్ర దాడులు తీవ్ర కలకలం రేపుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఓర్లీన్స్‌లో ఓ ట్రక్కు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. 30 మందికి గాయాలయ్యాయి. అనంతరం కొన్ని నిమిషాల్లోనే నిందితుడిని పోలీసులు తుదిముట్టించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. ప్రధాని మోడీతో సహా ఆయా దేశాధినేతలు ఉగ్ర దాడిని ఖండించారు. ఇక రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దర్యాప్తు చేపట్టింది. నిందితుడు షంసుద్-దిన్ జబ్బార్(42)గా గుర్తించారు. టెక్సాస్‌కు చెందిన అమెరికన్ పౌరుడు జబ్బార్‌గా కనిపెట్టారు. ఇక దాడికి ముందు కొన్ని గంటల ముందు ఫేస్‌బుక్‌లో ఐదు వీడియోలను పోస్టు చేశాడు. ఇందులో అతడు చేయబోయే హింసను గూర్చి పేర్కొన్నాడు. ఇక ట్రక్కుపై ఐసిసి జెండా ముద్రించి ఉంది. దీంతో ఇతడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా పేర్కొ్న్నారు. ఇక పోలీసులు.. నిందితుడి ఇల్లును సోదాలు చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి ఇంట్లో బాంబు తయారీ సామగ్రితో పాటు ఖురాన్ బుక్ తెరిచి ఉంది. ఈ పేజీలో ‘బలిదానం’ అనే మాటలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా అతడి గది నిండా ఇస్లాంకు చెందిన అనేక పుస్తకాలు ఉన్నాయి. సమీపంలో ప్రార్థన రగ్గు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్.. లక్షణాలు, ఎవరికి ఎక్కువ ప్రమాదం..?
కోవిడ్-19 తొలి కేసు నమోదై ఇటీవలే 5 ఏళ్లు గడిచాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఎంతటి దుర్భర పరిస్థితి అనుభవించిందో అందరికి తెలుసు. అయితే, తాజాగా మరో కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. కోవిడ్, ఫ్లూ లక్షణాలు కలిగిన ఈ వ్యాధి కారణంగా చాలా మంది ప్రజలు ఆస్పత్రుల్లో చేరిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా పరిణామాలు మరో కోవిడ్-19కి దారి తీస్తుందా అనే భయాలు ప్రపంచదేశాల్లో వ్యాపిస్తున్నాయి. కొన్ని సోర్సెస్ ప్రకారం.. వ్యాప్తి కారణంగా చైనా అత్యవసర పరిస్థితి ప్రకటించిందనే వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిన సమాచారం ప్రకారం.. చైనా అధికారులు తెలియని ఒక న్యూమోనియా కేసులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయని భావిస్తున్నారు. డిసెంబర్ 16 -22 మధ్య శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగినట్లు డేటా షేర్ చేశారు. చైనా ఆరోగ్య అధికారులు.. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందని ధ్రువీకరించారు. ఉత్తర ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైనట్లు తెలిపారు.
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన సూచీలు
న్యూఇయర్ ఆరంభంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో కొత్త జోష్ కనిపించింది. రెండు రోజుల పాటు సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్ల ఉత్సాహతతో సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. రెండు రోజుల పాటు కొనసాగిన జోష్‌కు శుక్రవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాల కారణంగా ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరిదాకా ఒడిదుడుకులు కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 720 పాయింట్లు నష్టపోయి 79, 223 దగ్గర ముగియగా.. నిఫ్టీ 183 పాయింట్లు నష్టపోయి 24, 004 దగ్గర ముగిసింది. నిఫ్టీలో విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ నష్టపోగా.. ఒఎన్‌జీసీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌యుఎల్ లాభపడ్డాయి. సెక్టార్లలో బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఫార్మా ఒక్కొక్కటి 1 శాతం క్షీణించగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. బీఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.33 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.
గుడ్‌న్యూస్.. ఈ టాటా ఎలక్ట్రిక్ కారుపై రూ.1.20 లక్షల తగ్గింపు!
ఎలక్ట్రిక్ కార్లపై (EV) బంపర్ డిస్కౌంట్ల సీజన్ కొనసాగుతోంది. వాస్తవానికి.. డీలర్‌షిప్ మిగిలిన స్టాక్‌ను విక్రయించేందుకు భారీ తగ్గింపులను ప్రవేశపెట్టాయి. 2024 సంవత్సరం ప్రారంభంలో విడుదలైన టాటా పంచ్ ఈవీపై గరిష్టంగా రూ. 1.20 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లతో పాటు, ద్విచక్ర వాహనాలపై కూడా స్టాక్ క్లియరెన్స్ విక్రయాలు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం, కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం టాటా పంచ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల వరకు ఉంది. పంచ్ ఈవీ ఫీచర్లు, తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. టాటా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ ప్యూర్ ఈవీ ఆర్కిటెక్చర్‌పై పంచ్ ఈవీ రూపొందింది. ఈ కారు స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో 25kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 315 కిలోమీటర్లు (MIDC) రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ మోడల్‌లో 35 kWh బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మోటార్, బ్యాటరీ ప్యాక్ ఐపీ67 రేటింగ్‌తో వస్తున్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల (ఏది ముందైతే అది) వారెంటీతో వస్తోంది.
టాలీవుడ్‌లో విషాదం.. డైరెక్టర్ కన్నుమూత
తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె నటి, రచయిత, దర్శకురాలు అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. జనవరి రెండో తేదీ ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆమె మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలో ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తర్వాత పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. ఓటీటీలు ఇంకా రాకముందే చేసిన ఆ సిరీస్ యూట్యూబ్ లో అందుబాదులో ఉంది. దానికి మంచి అప్లాజ్ దక్కింది. తర్వాత రెండేళ్ల క్రితం ఆమె పెళ్లికూతురు పార్టీ అనే సినిమా చేశారు. తర్వాత క్యాన్సర్ బారిన పడడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిన ఆమె అప్పటినుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మొదట ట్రీట్మెంట్ కి బాడీ సహకరించినా తర్వాత ఆ ట్రీట్మెంట్ పనిచేయలేదని, క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కన్నుమూసినట్లు చెబుతున్నారు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాలు తెరమీదకు రావడానికి ఆమె కృషి చాలా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ఎంతోమంది నటులకు సినీ అవకాశాలు రావడానికి దర్శకులకు దర్శకత్వ అవకాశాలు రావడానికి ఆమె కారణమయ్యారని తెలుస్తోంది. ఎంతోమంది దర్శకులను నిర్మాతలను కూడా ఆమె కలిపి ప్రాజెక్టులు పట్టాలెక్కించేవారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు ఆమె డైరెక్షన్లో మెళుకువలు కూడా విద్యార్థులకు నేర్పించేవారు. అపర్ణ మల్లాది మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొన్నట్లయింది.