సావిత్రీబాయి ఫులే 1831 జనవరి 3న నైగాన్, మహారాష్ట్ర (ప్రస్తుతం సతారా జిల్లా)లో జన్మించారు. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్, నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రిగా పేరుగాంచారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య సాయిత్రి బాయి ఫూలే. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన గొప్ప వ్యక్తి ఆమె.
విద్య ద్వారానే స్త్రీకి విముక్తి..
విద్య ద్వారానే స్త్రీకి విముక్తి లభిస్తుందని నమ్మారు. ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించారు. అలాంటి ఆదర్శ వంతురాలైన సావిత్రీబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతానికిపైగా మహిళా ఉపాధ్యాయులే ఉండటంతో.. వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేడు ఆమె జయంతి సందర్భంగా చరిత్రను తెలుసుకుందాం..
ఫూలే దంపతుల సేవలు మరువలేనివి..
దేశ సాంఘిక సంస్కరణోద్యమంలో ఫూలే దంపతుల పాత్ర మరువలేనిది. నాటి పరిస్థితుల్లో స్త్రీలను ఏ విధంగా అణిచివేశారో అందరికీ తెలిసిందే. “ఆడదంటే.. వంటింటి కుందేలు” అనే సామేత ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కనీసం భారత రాజ్యాంగంలో కల్పించిన ఆ కాలంలో వక్‌స్వాత్రంత్ర్యపు హక్కు కూడా వారికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ స్త్రీ అయి ఉండి.. సామాజిక రుగ్మతలను పారదోలేందుకు విస్త్రృతంగా కృషి చేశారు సావిత్రి బాయి ఫూలే. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో పదమూడేళ్ల జ్యోతి రావు ఫూలేతో (1840) వివాహం జరిగింది. వివాహానంతరం అభ్యుదయ భావాలున్న జ్యోతి రావు ఫూలే, సావిత్రి బాయి ఫూలేతో కలసి సాంఘిక సంస్కరణోద్యమంలో నూతన ఒరవడికి తెర లేపారు. ఈమె వివాహానంతరం ఇంట్లోనే విద్యాభ్యాసం ప్రారంభించారు.
మొక్కవోని దీక్ష..
1847లో ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందారు. 1848లో భర్త జ్యోతి రావు ఫూలేతో కలసి పూణేలో అణచివేతకు గురవుతున్న బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. కేవలం తొమ్మిది మంది బాలికలతో ఈ పాఠశాల ప్రారంభమైంది. అంచలంచెలుగా విస్తరిస్తూ.. పూణె, సతారా, అహ్మదా నగర్‌లలో మరికొన్ని పాఠశాలలు వెలిశాయి. పాఠశాలకు వెళ్లేటప్పుడు సనాతన చాందసవాదుల కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆమెను మార్గ మధ్యలో ఆపి అసభ్యకరమైన పదజాలంతో దూషించేవారు. రాళ్లతో దాడి చేసేవాళ్లు. పేడ నీళ్ళు చల్లి అవమానించేవారు. అయినా సరే వెనుకడుగు వేయలేదు. తన సంకల్పం విడవ లేదు.. తన సంచిలో అదనంగా మరో చీర పెట్టుకెళ్లి పాఠశాల దగ్గర మార్చుకునేవారు. వారు మొక్కవోని దీక్షతో ఎంతో మంది మహిళలను విద్యావంతులుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. చిన్న వయసులో వివాహం చేయటం వలన ప్రసవించే శక్తి లేక అనేకమంది బాలికలు ప్రాణాలు కోల్పోతున్నారని, చిన్న వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళు వితంతువులుగా జీవితాన్ని గడపాల్సి వస్తుందనే వాదన దృఢంగా వినిపించారు. వితంతువులను హీనంగా చూస్తూ, గుండు గీయించి తెల్ల చీర కట్టించి, వారిని అశుభ సంకేతంగా చిత్రించేవారు.
వితంతువులకు గుండు గీసే పద్ధతి..
ఆ దురాచారాన్ని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాల్ని ప్రోత్సహించారు సావిత్రిబాయి ఫూలే. భర్త చనిపోయిన వాళ్లకు దగ్గరుండి రెండో వివాహం చేయించి వారికి మరో జీవితాన్ని ప్రసాదించారు. వితంతు గర్భిణీల కోసం 1853లో ఒక గృహాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు దగ్గరుండి చూశారు. ఎవరి భర్త అయినా చనిపోతే ఆ వితంతు మహిళలకు గుండు గీసేవారు. ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఆమె పోరాడారు. చివరికీ రూపుమాపి విజయం సాధించారు. వరకట్నాన్ని వ్యతిరేకించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. 1852లో మహిళా హక్కులను మహిళలకు తెలియజేసేందుకు, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ‘మహిళా సేవా మండల్’ ఏర్పాటు చేశారు. కార్మికులు, గ్రామీణ పేదలు కోసం జ్యోతి రావు ఫూలే 52 ఆహార కేంద్రాలను తెరిచారు.
1897 మార్చి 10న తుది శ్వాస విడిచిన సావిత్రీబాయి…
జ్యోతీరావుపూలే 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగారు. ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. ఫూలే మరణాంతరం సత్యశోధాక్ సమాజ్ బాధ్యతనీ స్వీకరించి నడిపారు. 1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. ప్లేగు వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వారికి సేవ చేశారు. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు, పేదల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మృత్యువు ఒడికి చేరుకున్నారు. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు.