ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఖానాపూర్ సోషల్ మీడియా గ్రూప్‌లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తన రోజు వారి కార్యక్రమాలు, టూర్ షెడ్యూల్, హజరైన కార్యక్రమాల ఫోటోలు పెడుతున్నారు. అదే గ్రూప్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కార్యక్రమాలు సైతం పోస్ట్ చేస్తున్నారు. అయితే రాథోడ్ జనార్దన్ వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారని ప్రచారం ఉండటంతో వర్గపోరుకు తెరతీసింది. దాంతో ఖానాపూర్ సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న రేఖానాయక్ భర్త శ్యామ నాయక్.. జడ్పీ ఛైర్మన్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్ పార్టీ సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ అయింది. జడ్పీ ఛైర్మన్ సైతం అదే పేరుతో తన PA ద్వారా ఇంకో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించారు. ప్రస్తుతం ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది.
ఖానాపూర్ పరిధిలోని ఉట్నూరులో ఉంటున్న జడ్పీ ఛైర్మన్ జనార్దన్.. నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. ఏదో ఒక కార్యక్రమం పేరుతో జనాల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు జడ్పీ ఛైర్మన్. ఇది లోకల్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు అస్సలు రుచించడం లేదట. ఆమె కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఖానాపూర్‌లో పట్టుసడలకుండా జాగ్రత్త పడుతున్నారట ఎమ్మెల్యే. ఈ ఎత్తుగడల్లో భాగంగానే జనార్దన్‌ను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినట్టు టాక్.
ఖానాపూర్ టీఆర్ఎస్‌లో ఆధిపత్యపోరు పార్టీ పెద్దల దగ్గరకు వెళ్లినట్టు సమాచారం. అయితే సొంత ప్రచారంతోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలను ఏకరవు పెడుతూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయడం ఆసక్తిగా మారుతోంది. టికెట్ కోసం లొల్లి ఎలా ఉన్నా.. పార్టీ గురించి .. ప్రభుత్వ కార్యక్రమాల గురించి వారు చేస్తున్న పోస్టింగ్స్ సరికొత్తగా జనాల్లోకి వెళ్తున్నాయి. కాకపోతే సొంత భజన ఎక్కువైందనే టాక్ ఉంది. ఈ గొడవ ఇలా ఉండగానే.. ఖానాపూర్ టీఆర్ఎస్‌లో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక యువనేత.. మరో ఐఏఎస్‌ల పేర్లు నియోజకవర్గంలో విస్తృతంగా చర్చల్లో ఉన్నాయి. మొత్తానికి ఖానాపూర్‌లో వాట్సాప్‌వార్ అనేక మలుపులు తిరుగుతూ నేతల మధ్య వైరాన్ని పెంచేస్తోంది.