దక్షిణాదిలో మరో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.. తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. రాష్ట్ర నాయకత్వానికి పోరాడే సమస్యలు.. క్షేత్రస్థాయిలో నిరసనలు చేపట్టే అంశాలు అప్పగిస్తూనే.. ఎన్నికల రణతంత్రం మొత్తం జాతీయ నాయకత్వమే నడిపిస్తోందట. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ సంస్థాగత ఇంఛార్జులు తరచూ తెలంగాణకు రావడం.. పార్టీ నేతలతో సమీక్షలు చేస్తూనే ఇక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకుంటున్నారట. గ్రౌండ్ లెవల్ నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అప్పటికప్పుడు ప్లానింగ్ మార్చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ రచిస్తోన్న ఉమ్మడి వ్యూహం ప్రస్తుతం చర్చగా మారింది.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో బీజేపీ జాతీయ నాయకులు కూడా పాల్గొంటున్నారు. స్థానిక కేడర్‌లో జోష్ తీసుకొచ్చేలా ఉపన్యాసాలు.. గైడెన్స్ ఇస్తున్నారట. ఇక కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా కొన్ని బృందాలను తెలంగాణకు పంపినట్టు పార్టీ వర్గాల వినికిడి. ఆ టీమ్‌లు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. బీజేపీ నేతల పనితీరుపై ఢిల్లీ నాయకత్వానికి రిపోర్టులు పంపాయట. ముఖ్యంగా బండి సంజయ్ సంగ్రామ యాత్రకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ అందించినట్టు సమాచారం.
ఇదే సమయంలో బీజేపీ కార్యక్రమాల్లో వేగం పెంచేందుకు కొత్తగా తెలంగాణకు ఇంఛార్జులను పంపుతున్నారట. ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో ఇంఛార్జ్ వస్తారని తెలుస్తోంది. ఇలా ఇంఛార్జులుగా వచ్చేవారంతా ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకులే. ఆ మేరకు జాబితా సిద్ధమైందని.. ఇంఛార్జులు ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. గతంలో లోక్‌సభ ఎన్నికల ముందు.. GHMC ఎన్నికల సమయంలో ఇదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను తెలంగాణకు డంపింగ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జ్‌గా భూపేంద్ర యాదవ్, ఆయనతోపాటు సహ ఇంఛార్జులుగా గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటకల నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఈ సహ ఇంఛార్జులు తమ టీమ్‌ను తెచ్చుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పనిచేశాయి.
అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాకు ఒక నేతను ఇంఛార్జ్‌గా పంపించనుంది కేంద్ర బీజేపీ నాయకత్వం. ఇంఛార్జులుగా వచ్చేవాళ్లంతా స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ.. ఎన్నికల వర్క్ గుంభనంగా చేసుకుంటూ పోతారని టాక్. రాష్ట్ర నాయకత్వాన్ని తమ పని చేసుకోమని చెబుతూనే.. ఇంకోవైపు సెంట్రల్ టీమ్ ఢిల్లీ ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రణతంత్రం రచిస్తుందని తెలుస్తోంది. మరి.. బీజేపీకి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.