ఆయన ఫోన్ మోగిందంటే కాంగ్రెస్ నాయకులకు హడల్. గడిచిన కొన్ని రోజులుగా ఆయన వేట మామూలుగా లేదట. డైలీ ఏదో ఒక బాంబు పేల్చుతూనే ఉన్నారు. దీంతో మహాప్రభో.. ఏంటీ వాయింపు? అని తల పట్టుకుంటున్నారట పార్టీ నేతలు. ఇంతకీ ఎవరా లీడర్?
ఎదురుపడితే బ్యాండ్ బాజానే!
వి. హన్మంతరావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన ఫోన్ చేస్తే భయపడుతూనే కాల్ రిసీవ్ చేసుకుంటారు నాయకులు. ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయకపోతే.. రేపటి రోజున ఆయనకు ఎదురుపడినప్పుడు ఆ వాయింపు ఇంకా ఎక్కువగా ఉంటుందట. మనిషి మంచివారే.. కానీ.. చెప్పిందే చెబుతారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. అదే పెద్ద సమస్యగా భావిస్తారట కాంగ్రెస్ నాయకులు.
రేవంత్ ఎపిసోడ్‌లో నేతలకు ఫోన్‌లోనే వీహెచ్ వాయింపు
గడిచిన కొద్దిరోజులుగా VH నిత్యం మీడియాలోనే ఉంటున్నారు. పార్టీలో జరుగుతున్న పీసీసీ నియామక ప్రక్రియపై అసహనం.. ఆవేశంతో ఉన్నారాయన. కొత్తగా వచ్చిన రేవంత్‌కి పార్టీని అప్పగించడం ఏంటి? కేసుల్లో ఉన్న రేవంత్ జైలుకెళ్లితే.. పార్టీ అంతా జైలు చుట్టూ తిరగడం అవసరమా? అని మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ వైఖరి నచ్చని వారు VHకు ఫోన్ చేసి తిట్ల దండకం ఎత్తుకోవడం కూడా జరిగిపోయింది. అలాంటి కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారాయన. ఇదంతా రచ్చ రచ్చై పార్టీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ విషయంలో పీసీసీ మొదలుకొని.. AICC ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వరకు అందరినీ వాయించేశారు హన్మంతరావు. లేఖాస్త్రాలు కూడా సంధించారు.
వీహెచ్ ఫోన్ చేస్తే వార్ వన్‌సైడే!
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఇంఛార్జ్ ఠాగూర్‌కి VH ఫోన్ చేసి మరీ… ఫిర్యాదు చేసేవారు. హన్మంతరావు ఫోన్ అంటే తక్కువలో తక్కువ అరగంట వాయిస్తారనే ముద్ర పడిపోయింది. వార్ వన్ సైడే అన్నట్టుగా ఫోన్‌లో చెప్పేస్తారట. ఒకవేళ కాదని.. క్రాస్ ప్రశ్నలు వేస్తే.. ‘నువ్వు కూడా టీం మారినట్టున్నవురా బై..’ అని పుసుక్కుని ఓ మాట వదిలేస్తారట. VH ఆ మాట అనగానే అవతలి వాళ్ల ముఖం మాడిపోతుందని కాంగ్రెస్‌లో కథలు కథలుగా చెప్పుకొంటారు.
వీహెచ్ ఫోన్ ఎత్తడం మానేసిన ఠాగూర్
ఠాగూర్‌తోపాటు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు మొదలుకొని.. రాష్ట్రంలోని పార్టీ నాయకులకు తరుచూ ఫోన్ చేస్తారు. తన మనసులోని ఆవేదనను బయటపెడతారు హన్మంతరావు. ఏదీ దాచుకోరు. ఎదుటివాళ్లు ఏదైనా అనుకుంటారనే ఆలోచన చేస్తారో లేదో కానీ.. మాటలు మాత్రం పేటేపికాయల్లా పేలతాయి. దీంతో VH నుంచి వచ్చే ఫోన్‌ను ఎత్తడం మానేశారట ఇంఛార్జ్ ఠాగూర్. ఇక బోసురాజు అయితే.. హన్మంతరావు వాయించేస్తున్నాడు బాబోయ్ అని పార్టీ నాయకుల దగ్గర ఓపెన్ అయిపోతున్నారట. రాష్ట్రంలోని చాలా మంది కాంగ్రెస్ నాయకులకు VH నుంచి ఇదే విధమైన అనుభవం ఉందని చెబుతారు. కొందరైతే పైస్థాయిలో కంప్లయింట్ చేసిన సందర్భాలూ ఉన్నాయట.
కాంగ్రెస్ నేతల చెవులు వాచిపోతున్నాయట
VH చేసే దాంట్లో తప్పు లేకపోవచ్చు. కాకపోతే రోజూ ఒకే అంశంపై అరగంటకుపైగా మాట్లాడితే ఎలా? చెవులు వాచిపోతున్నాయి అని నేతలు ఒకరినొకరు చెప్పుకొని వాపోతున్నారట. అయితే మనవారే కదా చెప్పుకోవడంలో తప్పులేదన్నది హన్మంతరావు అభిప్రాయం. కానీ.. ఆ వైఖరి ఎదుటివారికి వాయింపులా మారిపోయింది. చెప్పేది సూటిగా చెప్తే బాగుంటుంది. అరగంటలు.. గంటలు వాయిస్తేనే తలనొప్పి అని అనుకుంటున్నారు నాయకులు. ప్రస్తుతం ఆయన రేవంత్ ఎపిసోడ్‌ను పట్టుకున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మారి.. పార్టీ నేతలను బెంబేలెత్తిస్తున్నారు హన్మంతరావు.