తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తప్పు చేశారా? లేక ఆయన చర్య కరెక్టేనా? అది పార్టీకి లాభమా? నష్టమా? భిన్నాభిప్రాయాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి? అసలింతకీ ఏం చేశారాయన? కొందరు ఎస్ అంటే… మరి కొందరు నో అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లేఖలు రాశారు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అందులో క్లారిటీ ఇచ్చేశారట. కొంతమంది సీనియర్ నాయకులు సైతం పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతం, నాయకత్వానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, ఆ విషయాన్ని జాతీయ నాయకత్వం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తోందని కూడా తన లేఖలో మెన్షన్ చేశారట స్టేట్ ప్రెసిడెంట్. కొందరు నేతల మాటలు, చేతలు పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని…ప్రతిష్టకు నష్టం చేస్తున్నాయన్నది రామచందర్‌రావు అభిప్రాయం.
ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే…. తమ వ్యక్తిగత అభిప్రాయాలను, అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో చర్చించడం పార్టీ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధమని క్లారిటీ ఇచ్చేశారాయన. అంతర్గత సమస్యలు, అభిప్రాయ బేధాలుంటే, వాటిని పార్టీ వేదికల మీద మాత్రమే చర్చించాలని కూడా లేఖలో పేర్కొన్నారాయన. ఈ అంశాల మీదే ఇప్పుడు పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయట. అసలిప్పుడు ఆయన ఆ స్థాయిలో ఒక్కొక్కరికి లేఖ రాయల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కొందరి క్వశ్చన్. పార్టీలో క్రమశిక్షణారాహిత్యం నిజంగా అంత తీవ్ర స్థాయిలో ఉందా? తెలంగాణ బీజేపీ గాడి తప్పి పోయిందా? పరిస్థితులు ఎంతో సీరియస్‌గా మారిపోతే తప్ప అలాంటి లేఖలు రాయకూడదని, అంటే… అధ్యక్షుల వారు అంత తీవ్రంగా పార్టీ నేతలు కట్టితప్పి ప్రవర్తిస్తున్నట్టు ఫీలవుతున్నారా అని కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారట మరికొందరు. తన దృష్టికి వచ్చిన అంశాలను ఇన్ఫార్మల్‌గా చెబితే సరిపోయేదని, అలా కాకుండా… లేఖ రాయడంతో ఇప్పుడు
తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని మాట్లాడుకుంటున్నారు నేతలు. అయితే ఇప్పటికే చాలా సార్లు లైన్ దాటొద్దని పార్టీ వేదికల మీద, వివిధ సందర్భాల్లో చెప్పినా… చాలా మంది పెడ చెవిన పెడుతున్నారని,సోషల్ మీడియాలో కూడా పరిధి దాటుతున్నారని, సొంత అజెండాతో మాట్లాడ్డం పెరిగిపోయిందని, అందుకే లేఖ రాయడం సబబేనన్నది మరికొందరు నాయకుల వాదన. ఎవరో… ఒకరో ఇద్దరినో ఉద్దేశించి లేఖ రాస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయిగానీ… పార్టీలోని బాధ్యులు, ఎంపీ ఎమ్మెల్యేలందరికీ రాయడంలో తప్పేంటన్నది వాళ్ళ క్వశ్చన్. ఈ చర్య ద్వారా… రేపు ఎవరన్నా పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందన్నది వాళ్ళ అభిప్రాయం.లేఖ అందుకున్న నేతల్లో జవాబుదారీ తనం పెరుగుతుందని చెబుతున్నారు… అయితే ఇక్కడే మరో చర్చ కూడా మొదలైంది. రాష్ట్ర అధ్యక్షుడు జనరల్‌గా అందరికీ లెటర్ రాసినా….అందులో ఎవరో కొందర్ని ఉద్దేశించి అయితే ఖచ్చితంగా ఉంటుందని, ఆ కొందరు ఎవరై ఉంటారంటూ ఎంక్వైరీలు మొదలెట్టేశారు.