పదవిలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా… ఆ ఎమ్మెల్యేకి పాత వాసనలు పోలేదా? తీరు మార్చుకో సారూ…. అని దగ్గరి వాళ్లు చెబుతున్నా…. మళ్ళీ మాట్లాడితే లెఫ్ట్ లెగ్‌తో తంతానన్నట్టు ట్రీట్ చేస్తున్నారా? చివరికి నియోజకవర్గ ప్రజల్లో సైతం ఆయన బిహేవియర్ గురించిన చర్చ జరుగుతోందా? కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నారంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన పాత వాసనలేంటి? ఈయన ఇంకా మారలేదా….? ఇక మారబోరా…? ఇలాగైతే… నెక్స్ట్ కష్టమే. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురించి నియోజకవర్గంలో జరుగుతున్న చర్చలివి. ఈ విషయం ఆయన దాకా చేరుతోందో లేదోగానీ… వ్యవహారం మాత్రం చాలా తేడాగా ఉందని సొంత జనసేన నాయకులే గుసగుసలాడుకుంటున్నారట. పాలిటిక్స్‌లోకి రాకముందు పోలీస్ ఆఫీసర్‌గా పని చేశారు గిడ్డి. ఉద్యోగానికి రాజీనామా చేసి 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరారాయన. కూటమి వేవ్‌లో కొట్టుకొట్టి తేలిగ్గా అసెంబ్లీ మెట్లు ఎక్కగలిగారు. అంతవరకు బాగానే ఉన్నా…. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర అవుతున్నా… ఆయన ఇంకా తన పోలీస్ బుద్ధి పోనిచ్చుకోవడం లేదని, ప్రజాప్రతినిధినన్న సంగతి గుర్తుకు ఉందోలేదోనని మాట్లాడుకుంటున్నారు.
సాయం కోసం వచ్చే నియోజకవర్గ ప్రజలకు పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ తప్ప ఎన్నుకున్న ప్రజాప్రతినిధిలా వ్యవహరించడం లేదని అంటున్నారు. రకరకాల ప్రశ్నలతో ఆయన ఇంటరాగేషన్‌ను మాత్రం తట్టుకోలేకపోతున్నామని, మాట అంత కటువుగా ఉంటే ఎలాగన్న అసహనం వ్యక్తం అవుతోంది. అదంతా ఒక ఎత్తైతే మరోవైపు ఎమ్మెల్యే తీరు నియోజకవర్గ కూటమిలో కూడా చిచ్చు రేపుతోందట. భాగస్వామిగా ఉంటూ కూడా టిడిపి శ్రేణులను జనసేనలో చేర్చుకోవడంపై సైకిల్ లీడర్స్ భగ్గుమంటున్నారు. పొత్తు ధర్మం పాటించకుంటే… వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతావ్ అంటూ టిడిపి శ్రేణులు బహిరంగంగానే ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పి.గన్నవరం టీడీపీ కోటాలోకేనంటూ… ప్రచారం కూడా మొదలుపెట్టేశారు కొందరు నాయకులు. దీంతో… టిడిపి, జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నట్టు చెబుతున్నారు.
బహిరంగ సమావేశాల్లో ఎమ్మెల్యే ఎదుటే జనసేన, టీడీపీ కేడర్ పరస్పరం వాదులాడుకుంటున్నాయి. ఇద్దరిదీ ఒకటే ప్రశ్న, మేం లేకపోతే మీరు ఎక్కడున్నారని. అటు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా టిడిపి నేతలపై రెచ్చిపోతున్నారట. పొత్తు ధర్మాన్ని పాటించని వాళ్ళకు ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు తెలుసునని కౌంటర్స్ వేయడం కాకరేపుతోంది. టీడీపీ స్థానిక నేతలు ఎదురు తిరగడంతో వాళ్లని ఎదుర్కోవడానికి ఎమ్మెల్యే కొత్త వ్యూహం పన్నుతున్నారట. తన మిత్రుడు, ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును టిడిపిలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. చిట్టిబాబుకు టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇప్పించుకోగలిగితే… తనుకు ఎదురే ఉండదన్నది గిడ్డి సత్యనారాయణ ప్లాన్‌గా తెలుస్తోంది. ఆ విషయం తెలిశాక టిడిపి శ్రేణులు ఎమ్మెల్యే మీద మరింత ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయట.
ఒకరకంగా ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గం కూటమిలో చీలిక వచ్చినట్టేనని చెప్పుకుంటున్నారు. టిడిపి, జనసేన వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయి. టిడిపి నేతలు కొత్త పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. ఎక్కువ మంది టీడీపీ ఆఫీస్‌కు వెళ్ళి తమ సమస్యలను మొరపెట్టుకోవటం జనసేన ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదట. దానికి కౌంటర్‌గా జనసేన కార్యకర్తలు కూడా… వాడవాడలా ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఇన్నాళ్లు ఆఫీస్‌కే పరిమితమైన గిడ్డి ఏడాదిన్నర తర్వాత జన మధ్యకు రావడం ఆసక్తికరంగా మారింది. మేం ఇన్నాళ్ళకు గుర్తుకొచ్చామా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి జనం నుంచి. ఆ మాటలు వింటుంటే… ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మ్యూజిక్ స్టార్ట్ అయిపోయినట్టుందన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పి.గన్నవరం కూటమిలోని విభేదాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులో ఉన్నాయి. రెండు పార్టీల పెద్దలు వీటిని సరిదిద్దుతారా…! లేక సాగ దీసుకుని గిల్లికజ్జాలతో టైంపాస్ చేస్తారా అన్నది చూడాలి.