కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైందా ? కేబినెట్ సమష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నా…లోలోపల నేతలు భయపడుతున్నారా ? ప్రాజెక్టును ఎందుకు వేగంగా పూర్తి చేశారో చెప్పేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారా ? అధినేత నుంచి కింది స్థాయి నేత వరకు…కాళేశ్వరం రిపోర్టుపై గుబులు పడుతున్నారా ?
తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు దెబ్బతినడం…సుందిళ్ల బ్యారేజీలో సీపేజ్ సమస్యలు రావడాన్ని కాంగ్రెస్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. వీటిపై విచారణకు ప్రభుత్వం…2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఉన్న అధికారులతో పాటు రాజకీయ నాయకులను ఓపెన్ కోర్టులో విచారణ జరిపింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను కమిషన్ విచారించింది. విచారణలో వాళ్ళు చెప్పిన అంశాలను అఫిడవిట్ రూపంలో తీసుకుంది. తమకు కావలసిన విషయాలు రాబట్టడానికి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది కమిషన్. రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది పీసీ ఘోష్ కమిషన్. దీంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. కమిషన్ ముందు హాజరైన హరీశ్‌రావుతో పాటు కేసిఆర్…అప్పటి ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పీసీ కమిషన్…ఫీల్డ్‌లోకి వెళ్లి పరిస్థితులను తెలుసుకుంది. దీంతో రిపోర్టులో ఏం రాశారన్నది ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్ నిర్ణయమే ప్రకారం ప్రాజెక్టు నిర్మించారని చెబుతున్నప్పటికీ…నివేదికలో ఏం రాశారోనని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారట. ప్రస్తుతానికి సీల్డ్ కవర్లో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందచేసింది కమిషన్. ఆ నివేదికలో అసలు ఏముందనేది ఎవరికి తెలియని పరిస్థితి. ప్రభుత్వ పెద్దలు కంటే బిఆర్ఎస్ నేతల్లో ఆ రిపోర్టుపై గుబులు రేపుతోందట. సీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదికలో ఏం చెప్పారు.. కాళేశ్వరం కుంగిన ఘటనలో ఎవరిని బాధ్యులు చేశారు ? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లు…విచారణ జరిపిన తర్వాత ఆ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి ? ఎవరి మీద వేటు వేశాయి అనే అంశాలు చర్చించుకుంటున్నారు బిఆర్ఎస్ నేతలు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎలా ఉన్నా సరే…ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలని చూస్తోంది బిఆర్ఎస్. ఆ ప్రాజెక్టు వల్ల జరుగుతున్న లాభాలను ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తోంది. కమిషన్ ముందు విచారణకు వెళ్లి వచ్చిన హరీశ్‌రావు…కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ప్రజెంటేషన్ రూపంలోనే సమాధానాలు ఇచ్చారు. నీటి లభ్యత, రైతులకు జరుగుతున్న మేలును వివరించారు. ప్రాజెక్టును అంత తొందరగా ఎందుకు నిర్మించారో…ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని పార్టీ భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు…ఈ రిపోర్టు బయట పెడితే తమకు ఏమైనా నెగిటివ్ జరిగే ప్రమాదం ఉందా అని బీఆర్ఎస్ ఆరా తీస్తోంది. అందుకే రిపోర్టులో ఎలా ఉన్నా ప్రచారం మాత్రం పాజిటివ్ గా చేసుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది.