ఆ రిజర్వుడ్ నియోజకవర్గంలో పదవుల పంచాయితీ పతాక స్థాయికి చేరిందా? ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కొందరు నాయకులు పావులు కదుపుతున్నారా? మేటర్ తెలిసి… మీ సంగతి అలా ఉందా….? అంటూ శాసనసభ్యుడు కూడా పావులు కదుపుతున్నారా? ఎక్కడ జరుగుతోందా రసవత్తర రాజకీయం? అందులో సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? దేవరకొండ దంగల్ పీక్స్‌కు చేరుతోంది. పేరుకు ఇది ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం అయినా…. పెత్తనం మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలను శాసించే సామాజికవర్గాలదేనన్నది బహిరంగ రహస్యం. అధికారంలో ఎవరున్నా, ఎమ్మెల్యే ఏ పార్టీ వారైనా… ఇక్కడ మాత్రం ఆ సామాజికవర్గాలదే హవా. ఈ క్రమంలోనే… పదవులు, ప్రాధాన్యత కోరుకుంటున్న కొందరు దేవరకొండ కీలక నేతలు ఎమ్మెల్యే బాలు నాయక్‌ను కాదని, ఆయనతో సంబంధం లేకుండా.. నియోజకవర్గంపై పట్టున్న కొందరి సహకారంతో సమాంతర రాజకీయం నడిపిస్తున్నారట. ఇటీవల ఓ అడుగు ముందుకేసిన కొందరు నేతలు… తమ నోటికాడ మద్దను ఎమ్మెల్యే లాగేసుకుంటున్నారంటూ తెలిసినోళ్ళకు, తెలియనోళ్ళకు చెప్పేస్తున్నారట. అటు సోషల్ మీడియాలో కూడా తమ ప్రతాపం చూపిస్తుండటంతో… దేవరకొండ కాంగ్రెస్‌లో ఇంటిపోరు బహిర్గతమవుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు.
నియోజకవర్గానికి చెందిన కీలక నేతల మధ్య మనస్పర్ధలే ఈ రచ్చకు, గ్యాప్‌నకు కారణం అనే అభిప్రాయం బలంగా ఉంది. సోషల్ మీడియాలో అసమ్మతి నేతల పోస్ట్‌లు ఎమ్మెల్యేదాకా చేరడంతో…. నేనేం తప్పుచేశాను, ఎవరికి అన్యాయం చేశానంటూ ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. అయితే..కేవలం బాధపడి ఊరుకోకుండా… అంత్య నిష్టూరం కన్నా…. ఆది నిష్టూరం మేలనుకుంటూ ఆయన కూడా రివర్స్ అటాక్ మొదలుపెట్టేశారట. కొద్దిరోజులుగా సందర్బం వచ్చిన ప్రతిసారీ… వేదికల మీద, అంతర్గ సమావేశాల్లో…. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారికి, తనపై సెటైర్లు వేసే బ్యాచ్‌కు బాలునాయక్ చురకలంటిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రూప్ రాజకీయలను ప్రోత్సహిస్తే సహించేది లేదంటూ…. అందుకు బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని క్లారిటీగా చెప్పేస్తున్నారట. నచ్చకపోతే పార్టీని వదిలేసి వెళ్ళిపోవాలని సూటిగా.. సుత్తి లేకుండా తేల్చిచెప్పేస్తుండటాన్ని స్థానిక నాయకులు కాస్త ఆశ్చర్యంగా చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారేంటని ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం.
పదవులు, ప్రాధాన్యతలే ఈ గ్యాప్‌నకు కారణమని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకు, కీలక నేతలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు కూడా మరో రీజన్ అయిఉండవచ్చన్న ప్రచారం హస్తం పార్టీ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది. పదేళ్ళ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవులపై కన్నేసిన దేవరకొండ నియోజకవర్గ నేతలకు ఎమ్మెల్యే బాలునాయక్ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదట. దీనికి క్యాస్ట్ అండ్ క్యాష్ ఈక్వేషన్స్ ఉన్నాయన్నది కొందరి మాట. దీంతో సదరు నేతలు మొదటి నుండి దేవరకొండ నియోజకవర్గంపై గట్టిపట్టు ఉన్న జిల్లా సీనియర్ నాయకులు, తమ పొటిలికల్ గాడ్‌ఫాదర్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆ విధంగా గ్యాప్ పెరిగిందన్నది లోకల్ టాక్. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు తెరవెనక పట్టున్న కీలక నేతల ప్రయోయం ఉంటే…. తెర ముందు వారి అనుచరులు వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి దేవరకొండ కాంగ్రెస్ వర్గాలు. ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు.. అన్నట్టు నియోజకవర్గంలో పరిస్థితి మారగా… దారి తప్పుతున్న వాళ్ళను ట్రాక్ ఎక్కించేది ఎవరు? నివురు గప్పిన నిప్పు బయటపడుతుందా లేక చల్లారుస్తారా అన్న చర్చలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో.