Off The Record: మరోసారి తెలంగాణలో ఆంధ్రా బిర్యానీని ఉడికించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత వంటకాలను, అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ… ఆంధ్రా ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడియాలో ఫైరైపోయారు. అయితే… అదంతా గతం. రెండు రాష్ట్రాలు అయ్యాక… ఆ గతాన్ని మర్చిపోయి… అంతా సోదర భావంతో మెలుగుతున్నారు. రాజకీయాల కోసం తప్ప… సాధారణ ప్రజలెవరూ మీరు, మేము అని మాట్లాడుకోవడం లేదు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అంత సుహృద్భావ వాతావరణం పెరిగిన క్రమంలో… ఇప్పుడు… ఆంధ్రా బిర్యానీ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి రచ్చరచ్చ అవుతున్నాయి.
Read Also: AP Liquor Scam Case: లిక్కర్ కేసు.. వారి విదేశీ పర్యటనపై సిట్ ఫోకస్..
బనకచర్ల ప్రాజెక్ట్ పై మాట్లాడిన కవిత… చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి బిర్యానీ పెట్టి మరీ… క్లియరెన్స్ ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే… దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ… ఆంధ్రా బిర్యానీ ఎలా ఉంటుందో గతంలో కేసీఆర్ చెప్పారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారామె. ఎవరి బతుకు వారు బతుకుతూ… హాయిగా కలిసిమెలిసి ఉన్న టైంలో కవిత అలా మాట్లాడ్డం ఏంటంటూ తీవ్ర దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలను ఖండించారు బిజెపి నేత విష్ణువర్దన్‌రెడ్డి. కవిత రాజకీయాలు మానేసి ఇప్పుడు బిర్యానీ రివ్యూలు చేస్తున్నారా? ఆంధ్రా తెలంగాణ పేరుతో ప్రజలను ఇంకా ఎన్నాళ్ళని అలా విడదీసి రాజకీయం చేస్తారు? ఆంధ్రా వాళ్ళంటే మీకు ఎందుకంత చులకన భావం? ఒక ప్రాంతాన్ని అవమానించి మీరు సాధించేది ఏమిటి? అంటూ ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌గానే ప్రశ్నించారు విష్ణువర్ధన్‌రెడ్డి. దీంతో ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రాంత వాసులను, అక్కడి వంటకాలను కించపరిచే విధంగా ఉన్న వ్యాఖ్యల్ని అసలు కవిత ఇప్పుడెందుకు గుర్తు చేయాల్సిన అవసరం వచ్చిందంటూ పార్టీలో చర్చించుకుంటున్నారట.
Read Also: TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
ప్రతిపక్షంలో ఉన్న ఈ టైంలో ఆ విషయాలను తిరగదోడటం పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టే అంశం అంటున్నారు చాలామంది గులాబీ నేతలు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత అన్న తరువాత బిఆర్‌ఎస్ నేతలు ఆమెతో దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో…. మళ్ళీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడ్డం వెనక వ్యూహం ఉందా? లేదా రొటిన్‌గానే ఆమె అలా అన్నారా? అనేది తేలాల్సి ఉంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఒకవైపు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు మరోవైపు జరగబోతున్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ ఓటర్లు ఎక్కువమంది హైదరాబాద్‌లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే… మెజార్టీ డివిజన్స్‌లో వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇలాంటి సమయంలో కవిత మరోసారి కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేయడం ద్వారా… పార్టీకి నష్టం జరుగుతుందా అని చర్చించుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు.