Off The Record: తెలంగాణలో ఇప్పుడు చేరికల కాలం నడుస్తోంది. పదేళ్లపాటు అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్, పవర్ పోగానే ఫిరాయింపులతో సతమతమవుతోంది. 2014, 2018లో రెండు సార్లు ఎవరి సాయం అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీఆర్‌ఎస్. అయినాసరే.. నాడు ఇతర పార్టీల ఎమ్మెల్యేల కోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. స్వచ్చందంగా వచ్చిన వాళ్ళు ఉంటే ఉండవచ్చుగానీ.. ఎక్కువ మందిని రకరకాల ప్రలోభాలతో లాక్కున్నారన్నది నాడు బీఆర్‌ఎస్ మీద వచ్చిన ఆరోపణ. ఆ సమయంలో మిగతా పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలు మరో ఆలోచన లేకుండా జంప్ అయ్యారు గులాబీ తోటలోకి. నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నామంటూ దాదాపుగా అందరిదీ ఒకటే మాట. కొందరు షరతులు పెడితే మరికొందరిది అన్‌కండిషనల్ జంపింగ్. అలా పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తే కొందరు గెలిచారు, మరికొందరు ఓడారు.
Read Also: Mirzapur 3: సరికొత్త రికార్డ్ సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్-3’
ఇక, 2023 ఎన్నికల్లో 39 సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది బీఆర్‌ఎస్. ఒకప్పుడు విచ్చలవిడి వలసల్ని ప్రోత్సహించిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు అదే వలసలతో విలవిల్లాడుతోంది. పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. అందరిదీ గాంధీభవన్ బాటే. చివరికి పార్టీకి చెప్పుకోతగ్గ ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి సైతం భారీగా వలసలు ఉంటాయన్న వార్తలు గులాబీ అధిష్టానానికి నిద్ర పట్టనివ్వడం లేదట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల జంపింగ్‌లకు సమాధానంగా, ఇంకా చెప్పాలంటే.. వాటికి చెక్ పెట్టేలా.. పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారంలో లేం కదా అని.. పార్టీని వదిలి పోతున్నారు. కానీ, రేపటి రోజు అనేది ఉంటుంది. మళ్ళీ ఎన్నికల ముందు మేం తిరిగి వచ్చేస్తాం… పార్టీలో చేర్చుకోండని అంటే… నో ఎంట్రీ బోర్డ్ పెట్టేస్తామన్నది బీఆర్‌ఎస్ పెద్దల మాటగా తెలుస్తోంది. ఇప్పుడు ఎంత మంది పార్టీని వీడి వెళ్లినా తమకు నష్టం లేదని, ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్యాడర్ మాత్రం అలాగే ఉందని అంటున్నారట బీఆర్‌ఎస్ లీడర్స్. వెళ్ళిపోయిన వాళ్ళను నాయకత్వ కొరత పేరుతో ఎన్నికలకు ముందు తీసుకునే బదులు.. ఉన్న నాయకుల నుంచే ఈ ఐదేళ్ళలో కొత్త లీడర్‌ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బీఆర్‌ఎస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Komatireddy Rajagopal Reddy: ఒక లక్ష్యం నెరవేరింది.. ఇంకో లక్ష్యం కేసీఆర్‌ను జైలుకు పంపడమే..
పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తాం కాబట్టి క్యాడర్ ఎవరూ వెళ్ళొద్దని, అందరికీ మంచి అవకాశాలు ఉంటాయని సందేశం పంపుతున్నారట. ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల ప్రస్తుతానికి సంఖ్య తగ్గినా.. భవిష్యత్‌లో నిఖార్సయిన, బీఆర్‌ఎస్‌లోనే పుట్టి పెరిగిన బలమైన నేతలు ఎదుగుతారని గులాబీ నాయకత్వం ఆశావహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన వారే అని.. అదే కేసీఆర్ బొమ్మతో మరో నాయకుడు ఎమ్మెల్యే అవుతారన్నది పార్టీ పెద్దల ధీమాగా తెలుస్తోంది. మొత్తంగా ఈ రూపంలో పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూనే.. కేడర్‌లో భరోసా నింపేందుకు బీఆర్‌ఎస్ పెద్దలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నది పొలిటికల్ సర్కిల్స్ అంచనా. మరి ఇలాంటి ప్రకటనలు వలసల్ని ఆపుతాయా? కేడర్‌లో ధీమా పెరుగుతుందా అన్నది చూడాలి.