Off The Record: ప్రశ్నిస్తా…. ప్రశ్నిస్తా… తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటా… ఇదీ జనసేన అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టైల్. అధికారంలో ఉన్నానా, ప్రతి పక్షంలో ఉన్నానా అన్నది డజంట్ మేటర్. తప్పు జరిగిందా లేదా అన్నదే నాకు ముఖ్యం అంటారాయన. అందుకు తగ్గట్టే… ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా తన ప్రశ్నావళిని ఓపెన్‌గానే ఉంచారాయన. దాన్నే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని మిగతా కొందరు సహచరులు ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో పవన్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా…. ఎక్కువ మంది పైకి చెప్పలేకపోతున్నా… లోలోపల మాత్రం ఇదెక్కడి క్వశ్చన్ బ్యాంక్ అంటూ గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. దాదాపు ఆరు నెలల క్రితం తొలిసారి….శాంతి భద్రతలపై దృష్టి సారించిన డిప్యూటీ సీఎం….కంట్రోల్ చేయలేకపోతే నేనే హోమ్ మంత్రి అవుతానంటూ బహిరంగంగా మాట్లాడ్డం కలకలం రేపింది. ఇక తర్వాత కేబినెట్ భేటీలో భూసేకరణ, అక్రమ లే ఔట్స్ క్రమబద్ధీకరణ, లులు మాల్‌కు భూ కేటాయింపులు వంటి అంశాలపై వరుస ప్రశ్నలు సంధించారాయన.
ఇప్పుడు తాజాగా భీమవరం డీఎస్పీ వ్యవహార శైలి వివాదాస్పదం కాగా… ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి మరణంపై నివేదిక కోరారాయన. ఇలా అంశం ఏదైనా…. పరిస్థితి ఎలాఉన్నా… ప్రశ్నించడాన్ని మాత్రం ఆపలేదు పవన్. అయితే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకేగానీ…ఇప్పుడు అధికారం ఉండి, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ… ఇలా ప్రశ్నలు లేవనెత్తడం ఏంటి? సొంత ప్రబుత్వానికే ఇబ్బందికరంగా కాదా అంటుూ…కూటమి వర్గాల్లో చర్చ మొదలైందట. ఇది ఇలాగే కొనసాగూతూ ఉంటే… ప్రభుత్వం పలచన అవడంతో పాటు విపక్షం చేతికి అస్త్రం ఇచ్చినట్టు కాదా అంటూ… గుసగుసలు మొదలైనట్టు సమాచారం. ఏ ఇష్యూ వచ్చినా… పవన్ ఏం ప్రశ్నిస్తారోనన్న భయం కూడా పెరుగుతూ పొలిటికల్ వేడి పుడుతున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అడగడం వరకు బాగానే ఉన్నా… ఆ ప్రశ్నలతో సంబంధిత మంత్రులు, అధికారులు మాత్రం ఇరుకున పడుతున్నారని, ప్రభుత్వానికి ఇది అంత మంచిది కాదని మాట్లాడుకుంటున్నాయట కూటమి వర్గాలు. పవన్ అడిగిన నివేదికలకు ఎలా స్పందించాలి..ఏం సమాధానం చెప్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అని తర్జనభర్జన పడుతున్నారట మంత్రులు, అధికారులు. ఒకవైపు ఆయన ప్రశ్నలు బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా, పరిపాలనాదక్షుడిలా అనిపిస్తున్నా…
మరోవైపు కూటమి మిత్రులకే అసౌకర్యం కలిగించే స్థాయికి చేరుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. భీమవరం డీఎస్పీ వ్యవహారం, పిఠాపురం ఆసుపత్రి ఘటన, లేఅవుట్ల క్రమబద్ధీకరణ… ఇలా ఒక్కోసారి ఒక్కో అంశం మీద పవన్ వేస్తున్న ప్రశ్నలు అటు సర్కార్ యంత్రాంగంలో కదలిక తెస్తున్నాయన్న చర్చ ఉంది. అదే సమయంలో ఆ ప్రశ్నలు కూటమి మిత్రపక్షాలకు పాలనలో సవాళ్ళు అవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలు ప్రభుత్వ యంత్రాంగాన్ని చైతన్యపరుస్తున్నాయా..లేక కూటమి సమీకరణాల్లో కొత్త మార్పులకు పురుడు పోస్తున్నాయా అన్నది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఉదయిస్తున్న కొత్త ప్రశ్న.