ఆదిమూలపు సురేష్. ఏపీ మంత్రివర్గంలో రెండోసారి చోటు దక్కించుకున్న ఆయన ప్రస్తుతం మునిసిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే వైసీపీ కార్యకర్తలు మంత్రికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వటంతో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆయన తొలిసారి మంత్రి అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుల్లలచెరువు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి మంచి మార్కులే కొట్టేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని వైసీపీ నేతలే మంత్రి సురేష్‌పై తిరుగుబాటు ప్రకటించారు.
పుల్లలచెరువు మండలంలోని కొందరు అసమ్మతి నేతలు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలంతా బారీగా తరలివెళ్లారట. మండలస్థాయి నేతల మధ్య విభేదాలతో మీటింగ్ పెట్టుకున్నారని మొదట భావించినా.. చివరకూ అక్కడకు వెళ్లిన వారంతా నేరుగా మంత్రి సురేష్‌ను టార్గెట్ చేసి మాట్లాడటంతో అసలు విషయం అర్దమైందట. మండలంలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య విభేదాలే సమావేశానికి కారణమనుకున్నా హాజరైన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన నేతలే ఎక్కువగా మంత్రి సురేష్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారట.
ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా గడపగడపకు కార్యక్రమానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని సమావేశంలో చర్చించుకున్నారట నేతలు. పైగా మంత్రి సురేష్ వర్గాలను ప్రోత్సహిస్తున్నారని.. ఇటీవల వెలుగుచూసిన పలు అవినీతి అంశాలను చర్చించారట. 19 పంచాయతీల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు గ్రామ, మండలస్థాయి నేతలు హాజరు కావటం చర్చగా మారిందట. ఓ నాయకునికి మంత్రి సురేష్ ప్రాధాన్యం ఇవ్వడంపైట్ల.. ఆయన వ్యతిరేకవర్గానికి చెందిన జడ్పీటీసీ ఏరువ చలమారెడ్డి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులెవరూ పెద్దారవీడు మండల సర్వసభ్య సమావేశానికి రాలేదు. దీంతో సమావేశం కోరంలేక వాయిదా పడింది.
ఆ మధ్య ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రి సురేష్‌ను వైసీపీ కార్యకర్తలే అడ్డుకున్నారు. ఎర్రగొండపాలెంలో వైసీపీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆదినారాయణ హత్య కేసులో మరో వైసీపీ నేత కందూరి గురును పోలీసులు అరెస్ట్ చేశారు. దోర్నాల మండలం నల్లగుంట్ల వైసీపీ సర్పంచ్ భర్త మొద్దు వెంకటేశ్వర్లు.. బైక్‌పై నల్లగుంట్ల వెళ్తుండగా కొర్రపోలు సమీపంలో వైసీపీకే చెందిన ప్రత్యర్దులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వరస పరిణామాలు మంత్రి సురేష్‌కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయినా మంత్రి పట్టించుకోవటం లేదన్నది కార్యకర్తల ఆరోపణ. చేతలు కాలాకా ఆకులు పట్టుకోకుండా.. ముందుగానే మేల్కొని అసమ్మతి నేతలను సురేష్ ఎలా బుజ్జగిస్తారో చూడాలి.